అడుగడుగునా ఆదరణ | - | Sakshi
Sakshi News home page

అడుగడుగునా ఆదరణ

Oct 30 2026 7:18 AM | Updated on Oct 30 2026 7:18 AM

● ‘వన్‌ డే విత్‌ మేయర్‌ అభ్యర్థి’లో ప్రజా సమస్యలు, కూటమిపై ఆగ్రహం

మధురవాడ 6వ వార్డులో ప్రచారం చేస్తున్న మేయర్‌ అభ్యర్థి వరుదు కల్యాణి, చిత్రంలో మాజీ ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మి, సమన్వయకర్త బొత్స అనూష

సాక్షి, విశాఖపట్నం : వైఎస్సార్‌సీపీ మేయర్‌ అభ్యర్థి, ఎమ్మెల్సీ వరుదు కల్యాణికి ఎన్నికల ప్రచారంలో ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. వీధి వ్యాపారుల నుంచి మధ్యతరగతి కుటుంబాల వరకు పలువురు ఆమెకు మద్దతు తెలుపుతూ, నగర సమస్యలను ఏకరువు పెడుతున్నారు. తాగునీటి కొరత, నిలిచిపోయిన సంక్షేమ పథకాలు, అధ్వాన రహదారులు, డ్రైనేజీ సమస్యలపై కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గురువారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ‘వన్‌ డే విత్‌ మేయర్‌ అభ్యర్థి’ పేరిట ‘సాక్షి’ నిర్వహించిన క్షేత్రస్థాయి పరిశీలనలో ఈ అంశాలు వెలుగుచూశాయి.

గుక్కెడు నీటికీ ఇబ్బందులే..

జీవీఎంసీ పరిధిలోని అక్కయ్యపాలెం, శ్రీనివాస్‌నగర్‌, లలితానగర్‌ ప్రాంతాల్లో మూడు రోజులకోసారి నీటి సరఫరా జరుగుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసరాల ధరలు పెరిగాయని, ఎన్నికల హామీలు అమలు కావడం లేదని చిరువ్యాపారులు, మహిళలు మండిపడ్డారు. పిల్లలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌, పేదలకు ఆరోగ్యశ్రీ సేవలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఆడబిడ్డ నిధి’, నిరుద్యోగ భృతి, ఉచిత గ్యాస్‌ సిలిండర్లు, డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ రుణాల హామీల అమలుపైనా నిలదీశారు. రోడ్లపై గుంతలు, అస్తవ్యస్త డ్రైనేజీతో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు.

ఉత్తరం నుంచి భీమిలి వరకు ప్రచార హోరు

విశాఖ ఉత్తర నియోజకవర్గంలో జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలకు రైల్వే న్యూ కాలనీలోని ఆర్చ్‌ వద్ద ప్రచారం ప్రారంభమైంది. 46వ వార్డు నుంచి 47, 48, 49వ వార్డుల మీదుగా ర్యాలీ సాగింది. మధ్యాహ్నం మాధవధారలోని గ్రాండ్‌ మిలాన్‌ ఫంక్షన్‌ హాల్లో జాన్‌ వెస్లీ అధ్యక్షతన జరిగిన క్రిస్టియన్‌ మైనారిటీ ఆత్మీయ సమావేశంలో వరుదు కల్యాణి పాల్గొన్నారు. అనంతరం తూర్పు నియోజకవర్గంలో మొల్లి అప్పారావు నేతృత్వంలో 15 వార్డుల్లో ప్రచారం నిర్వహించారు. సాయంత్రం భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త బొత్స అనుష ఆధ్వర్యంలో 6, 8, 11వ వార్డుల్లో ఇంటింటి ప్రచారం సాగింది. ఆయా ప్రాంతాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని మద్దతు తెలిపారు. విశాఖ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై వరుదు కల్యాణిపై నమ్మకంతో ఉన్నామని పలువురు పేర్కొన్నారు. ఎన్నికల హామీల అమలులో ప్రభుత్వ వైఫల్యాలకు ఓటుతో సమాధానం చెబుతామని స్పష్టం చేశారు.

వరుదు కల్యాణికి

జన నీరాజనం

కూరగాయలు, బియ్యం వ్యాపారులను ఓటు అభ్యర్థిస్తున్న వరుదు కల్యాణి, కేకే రాజు

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:

గ్రేటర్‌ విశాఖ మేయర్‌ ఎన్నికల వేళ అధికార కూటమి నేతలు భారీ వసూళ్లకు తెరతీశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నగరంలోని బడా బిల్డర్లు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల నుంచి ఒక్కొక్కరి వద్ద రూ. 15 లక్షల చొప్పున, జీవీఎంసీ, వీఎంఆర్‌డీఏ పరిధిలో పనులు చేపట్టే ప్రధాన కాంట్రాక్టర్ల నుంచి రూ. 10 లక్షల వరకు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సమాచారం. వైన్‌షాపుల యాజమాన్యాల నుంచి కూడా రూ. 4 లక్షల చొప్పున డిమాండ్‌ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మూడు వర్గాల నుంచి మొత్తం రూ. 14 కోట్ల మేర సమీకరించేందుకు జాబితాలు సిద్ధం చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ మొత్తాన్ని నగదు రూపంలోనే అందించాలని ఒత్తిడి తెస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఎమ్మెల్యేలు వెనుకడుగు.. వసూళ్లకు తెర?

రాష్ట్రంలోనే అతిపెద్ద కార్పొరేషన్‌ అయిన జీవీఎంసీకి 120 వార్డులున్నాయి. ఇక్కడ మేయర్‌ ఎన్నికలను అధికార కూటమి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ, అభ్యర్థి ఎంపికపై కూటమి ఎమ్మెల్యేల్లోనే అసంతృప్తి నెలకొందనే ప్రచారం ఉంది. తమ సూచనలను పక్కనపెట్టి, ఎంపీ భరత్‌ సిఫారసు మేరకు శ్రావణిని అభ్యర్థిగా ప్రకటించారనే అభిప్రాయం కొందరు నేతల్లో ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వరుదు కల్యాణికి గతంలో ఎమ్మెల్సీగా పనిచేసిన అనుభవంతోపాటు ప్రజా సమస్యలపై అవగాహన ఉందనే అభిప్రాయం ఉంది. దీంతో మేయర్‌ ఎన్నికల్లో ఆమె అభ్యర్థిత్వం అధికార కూటమికి సవాల్‌గా మారిందనే రాజకీయ విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో గెలుపు కోసం ఓటర్లను ప్రలోభపెట్టేందుకు నగదు పంపిణీకి సిద్ధమవుతున్నారనే ఆరోపణలు తెరపైకి వచ్చాయి. పార్టీ ఫండ్‌ కింద ఒక్కో ఎమ్మెల్యే రూ. కోటి చొప్పున ఇవ్వాలని కోరినా ఎవరూ ముందుకు రాలేదని, దీంతో బిల్డర్లు, కాంట్రాక్టర్లు, వైన్‌షాపుల యాజమాన్యాలపై దృష్టి సారించారని ప్రచారం జరుగుతోంది. ఈ వసూళ్ల బాధ్యతలను ముగ్గురు వ్యక్తులకు అప్పగించినట్టు, ఒక్కొక్కరికి ఒక్కో వర్గం నుంచి డబ్బు సమీకరించే బాధ్యత ఇచ్చినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకోసం ఇప్పటికే పేర్లు, చెల్లించాల్సిన మొత్తాలతో జాబితాలు రూపొందించినట్టు సమాచారం.

పక్కాగా వసూళ్ల లెక్క..!

నగరంలో భారీ భవన నిర్మాణాలు, రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. జీవీఎంసీ పరిధిలో ప్రతి ఏటా రూ. 5 వేల కోట్ల విలువైన పనులను చేపడుతున్నారు. అలాగే నగరంలో వందకు పైగా వైన్‌షాపులు ఉన్నాయి. ఈ మూడు వర్గాలనే లక్ష్యంగా చేసుకుని వసూళ్ల ప్రణాళిక రూపొందించినట్టు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

బిల్డర్లు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు : నగరంలోని 50 మంది ప్రముఖులను గుర్తించి, ఒక్కొక్కరి నుంచి రూ. 15 లక్షల చొప్పున మొత్తం రూ. 7.5 కోట్లు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సమాచారం.

ప్రధాన కాంట్రాక్టర్లు : జీవీఎంసీ, వీఎంఆర్‌డీఏ పరిధిలో పనులు చేపట్టే 25 మంది బడా కాంట్రాక్టర్ల నుంచి ఒక్కొక్కరి వద్ద రూ. 10 లక్షల చొప్పున రూ. 2.5 కోట్లు సమీకరించాలని నిర్ణయించినట్టు ప్రచారం జరుగుతోంది. వీరిలో కొందరి నుంచి ఇప్పటికే డబ్బు వసూలు చేసినట్టు ఆరోపణలున్నాయి.

వైన్‌షాపుల యాజమాన్యాలు: ఒక్కో షాపు నుంచి రూ. 4 లక్షల చొప్పున వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సమాచారం. ఈ వర్గం నుంచి రూ. 4 కోట్లు సమీకరించాలన్నది ప్రణాళికగా ప్రచారంలో ఉంది.

ఈ మూడు వర్గాల నుంచి మొత్తం రూ. 14 కోట్ల మేర వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కొంత మొత్తం చేతులు మారినట్టు ప్రచారం జరుగుతోంది.

మొత్తంగా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేమని భావించిన తెలుగుదేశం పార్టీ నేతలు.. ఇలా అడ్డమైన దారులను వెదికే పనిలో పడినట్టు తెలుస్తోంది. ఇక రాబోయే రోజుల్లో తమ నుంచి ఇంకెన్ని వసూళ్లకు తెగబడతారోననే భయాందోళనలు ఆయా వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement