42,438 దరఖాస్తులు పెండింగ్‌లోనే.. స్థానిక ఎన్నికల వేళ మళ్లీ హడావుడి కొత్తవి ఇవ్వకపోగా.. ఉన్న పింఛన్లలోనూ కోత గత నెల 1,56,610.. ఈ నెల 1,55,811 మందికే పింఛన్లు
మహారాణిపేట: ఎన్నికల ముందు అవ్వాతాతలకు అరచేతిలో వైకుంఠం చూపించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ కొత్త పింఛన్లు ఇస్తామని హోరెత్తించారు. అధికారం చేపట్టాక అందరికీ మొండిచేయి చూపించారు. కూటమి ప్రభుత్వం వచ్చి రెండున్నరేళ్లు గడిచిపోయింది. ఇప్పటి వరకు ఒక్కరికి కూడా కొత్త పింఛన్ ఇవ్వకపోవడం గమనార్హం. స్థానిక ఎన్నికలకు నగరా మోగుతున్న సమయంలో మళ్లీ కొత్త పింఛన్ల హడావుడి చేసి.. దరఖాస్తుల సమర్పణకు కేవలం 10 రోజులే గడువు ఇచ్చారు. కానీ ఎప్పటిలాగే.. ఇబ్బందులు పడి దరఖాస్తులు చేసుకున్న వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు నిరీక్షణే మిగిలింది. విశాఖ జిల్లాలో ఏకంగా 42,438 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా.. ఉన్న పింఛన్లకూ కోత పడుతోంది. గత నెల 1,56,610 మంది లబ్ధిదారులు ఉండగా.. ఈ నెలకు వచ్చేసరికి ఆ సంఖ్య 1,55,811కు పడిపోయింది. అంటే ఒక్క నెలలోనే 799 మందికి పింఛన్ దూరమైంది.
50 ఏళ్ల పింఛన్ హామీ గాలికి? : ఎన్నికల ప్రచారంలో 50 ఏళ్లు దాటిన వారికి, వివిధ కేటగిరీలకు చెందిన దివ్యాంగులకు పింఛన్లు అందిస్తామని చంద్రబాబుతో పాటు కూటమి పార్టీల నేతలు హామీలు గుప్పించారు .అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్ మొత్తాన్ని రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచుతామని ప్రకటించారు. దీంతో తమకు భరోసా లభిస్తుందని భావించిన పలువురు అర్హులు కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ప్రభుత్వం ఏర్పాటై రెండున్నరేళ్లు గడిచినా కొత్త పింఛన్ల జాడే లేదు.
42 వేల దరఖాస్తులు పెండింగ్ : జిల్లాలో కొత్త సామాజిక పింఛన్ల కోసం మొత్తం 42,438 దరఖాస్తులు అందాయి. వీటిలో వృద్ధాప్య పింఛన్ల కోసం 21,275 మంది, వితంతువులు 12,761 మంది, దివ్యాంగులు 5,267 మంది దరఖాస్తు చేసుకున్నారు. డప్పు కళాకారులు 250 మంది, మత్స్యకారులు 1,593 మంది, ఒంటరి మహిళలు 477 మంది, గీత కార్మికులు 531 మంది, చర్మకారులు 201 మంది, ట్రాన్స్‌జెండర్లు 29 మంది, చేనేత కార్మికులు 54 మంది దరఖాస్తులు సమర్పించారు. ఇంతమంది దరఖాస్తులు చేసుకున్నా కొత్త పింఛన్ల మంజూరుపై స్పష్టత లేకపోవడంతో అర్హులు ఆందోళన చెందుతున్నారు. దరఖాస్తుల స్థితిగతులు తెలుసుకునేందుకు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)ను ఆశ్రయిస్తున్నవారూ ఉన్నారు. సచివాలయాల చుట్టూ తిరుగుతున్నా సమాధానం లభించడం లేదని వాపోతున్నారు.
తనిఖీల పేరుతో లబ్ధిదారుల్లో ఆందోళన
పింఛన్ల అర్హతల పరిశీలనలో భాగంగా సదరం ధ్రువపత్రాల తనిఖీలు, మంచానికే పరిమితమైన రోగుల ఇళ్లకు వెళ్లి పరిశీలించడం, మానసిక వైకల్యం ఉన్నవారిని ఆస్పత్రులకు పిలిచి పరీక్షలు నిర్వహించడం వంటి చర్యలు లబ్ధిదారులను కలవరానికి గురిచేస్తున్నాయి. ఈ ప్రక్రియతో తమ పింఛన్లు ఎక్కడ నిలిచిపోతాయోనని కొందరు లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. అర్హతల పరిశీలన పారదర్శకంగా జరగాలని, నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరగకుండా చూడాలని కోరుతున్నారు.
నేడు పింఛన్ల పంపిణీ
జిల్లాలో అక్టోబరు నెలకు సంబంధించి 1,55,811 మంది లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం రూ.68.64 కోట్లకుపైగా నిధులు విడుదల చేసింది. శుక్రవారం పింఛన్ల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేశారు. జిల్లా కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ పంపిణీ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో డీఆర్‌డీఏ, నగర పరిధిలో జీవీఎంసీ ఆధ్వర్యంలో పంపిణీ చేపట్టనున్నారు.
కొత్తవి లేవు.. ఉన్న వాటికి కోత
ఒకవైపు కొత్త పింఛన్ల కోసం వేలాది మంది ఎదురుచూస్తుండగా.. మరోవైపు ఇప్పటికే పింఛన్లు పొందుతున్న వారి సంఖ్య నెలనెలా తగ్గుతోంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో విశాఖ జిల్లాలో 1,65,891 మంది లబ్ధిదారులు ఉండగా.. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. 2024 జూలైలో 1,64,239 మంది ఉండగా.. ఆగస్టులో 1,62,490 మందికి చేరింది. తాజాగా ఈ ఏడాది సెప్టెంబరులో 1,56,610 మందికి పింఛన్లు అందగా.. అక్టోబరులో 1,55,811 మందికే పరిమితమైంది. సెప్టెంబరుతో పోలిస్తే అక్టోబరులో 799 మంది తగ్గడం గమనార్హం.


