సాక్షి, విశాఖపట్నం: జీవీఎంసీ రాజకీయాల్లో ప్రస్తుతం 54వ వార్డు హాట్ టాపిక్‌గా మారింది. రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పే స్థాయి నాయకులంతా కలిసి.. కేవలం ఒకే ఒక కార్పొరేటర్ అభ్యర్థిని ఎదుర్కొనేందుకు ఈ వార్డులో వాలిపోయారు! అంతటి శక్తివంతుడు ఎవరో అనుకుంటున్నారా? ఆతనే వైఎస్సార్‌సీపీ తరఫున బరిలో నిలిచిన మాజీ కార్పొరేటర్ బాణాల శ్రీనివాసరావు.
వార్డు కొత్తదే కానీ.. : జీవీఎంసీ వార్డుల పునర్విభజనలో ఏ వార్డుకూ లేనన్ని చీలికలు ఈ వార్డులో తీసుకొచ్చారు. పాత వార్డును ఐదారు ముక్కలు చేశారు. కానీ శ్రీనివాసరావుకు ఉత్తర నియోజకవర్గంలో ఉన్న పట్టు చూసి కూటమి శిబిరానికి గుండెల్లో గుబులు పట్టుకున్నట్లుంది. అందుకే, కూటమి తరఫున బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎంఎంఎన్ పరశురామరాజు బరిలో దిగినా.. గెలుపు నమ్మకం పెట్టుకోలేకపోయారు. కూటమి పార్టీలతోపాటు ఆయనకు అండగా సొంతపార్టీకి చెందిన పెద్ద పెద్ద తలకాయలన్నీ ఇదే వార్డులో తిష్ట వేశాయి.
ప్రచారానికొచ్చిన ’పెద్ద మనుషులు’!
సాధారణంగా వార్డు ఎన్నికలంటే స్థానిక నాయకులు తిరుగుతారు. కానీ ఇక్కడ సీన్ వేరు! వైఎస్సార్‌సీపీ అభ్యర్థిపై పట్టు దక్కించుకునేందుకు ఏకంగా ఎంపీ సీఎం రమేష్ గురువారం రంగంలోకి దిగిపోయారంటే ఇక్కడ పోటీ ఎంత రసవత్తరంగా సాగుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక వీరితో పాటు ఆ పార్టీకి హేమాహేమీలుగా చెప్పుకునే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, రాష్ట్ర స్థాయి పదవులున్న చొక్కాకుల వెంకట్రావు, కాశీవిశ్వనాథ్ లాంటి దిగ్గజాలంతా ఇక్కడే మకాం వేసి మరీ ప్రచారం చేస్తున్నారు. నగరంలో తమ కూటమి అభ్యర్థులు ఎవరెవరో గెలుస్తున్నారో పట్టించుకోని ఈ పెద్దలందరూ.. జనసేన మిత్రులను కూడా పక్కనపెట్టి మరీ ఈ ఒక్క వార్డుపైనే ప్రత్యేకంగా కన్నేయడం విశేషం!
తెరవెనుక వ్యూహాలు అన్నీ ఇన్నీ కావు!
టీడీపీ టికెట్ ఆశించి భంగపడి, ఇండిపెండెంట్(టీడీపీ రెబల్)గా నామినేషన్ వేసిన నాయకుడిని సైలెంట్ చేసేందుకు కూటమి పెద్దలు తెరవెనుక రకరకాల ప్రయత్నాలు చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ‘ఓటుకు ఎన్ని వేలైనా ఇవ్వండి.. అగ్రనేతల నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం’.. అంటూ తమ ధన బలాన్ని చూపుతున్నారని సమాచారం. మొత్తానికి, ప్రజలంతా బాణాల శ్రీనివాసరావు వైపే మొగ్గు చూపుతున్నారనే భయంతోనే.. కూటమి నాయకులు తమ అధికారాలను, ధనాన్ని నమ్ముకుని ఎలాగైనా గెలవాలని సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. కానీ ఇక్కడి ప్రజలు మాత్రం ముక్కున వేలేసుకుంటూ నవ్వుకుంటున్నారు. ‘అరెరే.. కేవలం ఒకే ఒక కార్పొరేటర్ గెలుపును ఆపడానికి ఎంపీలు, రాష్ట్ర స్థాయి నాయకులు అంతా కలిసి దిగాల్సి వస్తోందంటే.. మన శీనన్న రేంజ్ ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది!’అంటూ కూటమి అభిమానులకు చురకలు వేస్తున్నారు.


