లిస్ట్‌లో ట్విస్ట్‌! | - | Sakshi
Sakshi News home page

లిస్ట్‌లో ట్విస్ట్‌!

Oct 30 2026 7:18 AM | Updated on Oct 30 2026 7:18 AM

జీవీఎంసీ వార్డు నంబర్‌ 51..

ఎన్నికల రికార్డుల్లో 23

గ్రేటర్‌ ఎన్నికల్లో వార్డుల గుర్తింపులో

తీవ్ర గందరగోళం

ఓటర్ల జాబితా, సీరియల్‌ నంబర్లలో దొర్లిన భారీ తప్పులు

బరిలో నిలిచిన అభ్యర్థుల్లో ఆందోళన

తక్షణమే ఎలక్టోరల్‌ రికార్డులు

సవరించాలని స్థానికుల డిమాండ్‌

సాక్షి, విశాఖపట్నం : గ్రేటర్‌ ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకున్న వేళ.. ఓటరు జాబితాల్లోని భారీ అవకతవకలు కలకలం రేపుతున్నాయి. ఎన్నికల అధికారుల నిర్లక్ష్యం ఓటర్లలో గందరగోళానికి కారణమవుతోంది. ఒకవైపు నవంబర్‌ 1న పోలింగ్‌, 3న ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైందంటూ అధికారులు అధికారిక నోటిఫికేషన్లు విడుదల చేస్తే.. క్షేత్రస్థాయిలో మాత్రం ఓటర్లు తమ అసలు వార్డు ఏదో తెలియక దిక్కుతోచని స్థితిలో పడ్డారు. మున్సిపల్‌ రికార్డుల్లోని వార్డు నంబర్లకు, ఎస్‌ఐఆర్‌ ఓటరు నమోదు రికార్డుల్లో కనిపిస్తున్న వివరాలకు ఏమాత్రం పొంతన లేకపోవడంతో ఓటర్లలో తీవ్ర అయోమయం నెలకొంది.

క్షేత్రస్థాయి పరిశీలన ఏదీ?

గ్రేటర్‌ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా రూపకల్పనలో క్షేత్రస్థాయి పరిశీలన లోపించిందనే విమర్శలు తాజా పరిణామాలతో వెల్లువెత్తుతున్నాయి. భౌతికంగా 51వ వార్డులో నివసిస్తున్న ప్రజల వివరాలను ఎస్‌ఐఆర్‌ రికార్డుల్లో ఉత్తర నియోజకవర్గంలోని 23వ వార్డు కింద చూపిస్తున్నారు. ఒక వార్డులోని ఓటర్లను మరో వార్డు జాబితాలో చేర్చడంతో ఓటరు స్లిప్పుల పంపిణీ, పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు ప్రక్రియలు గాడి తప్పుతున్నాయి. సీరియల్‌ నంబర్లు సైతం తారుమారవడంతో తమ ఓటు ఎక్కడ ఉందో, అసలు జాబితాలో ఉందో లేదో తెలియక ఓటర్లు ఆందోళన చెందుతున్నారు.

కౌంటింగ్‌ కేంద్రం వివరాలతో బట్టబయలు

ఓట్ల లెక్కింపునకు సంబంధించిన వివరాలను అధికారులు వెల్లడించడంతో ఈ గందరగోళం వెలుగులోకి వచ్చింది. నార్త్‌ జోన్‌ పరిధిలోని 51వ వార్డు ఓట్ల లెక్కింపు ఏయూ సౌత్‌ క్యాంపస్‌లోని స్కూల్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ భవనం మొదటి అంతస్తులోని 10వ గదిలో నిర్వహించాల్సి ఉంది. ఇందుకోసం 17 టేబుళ్లను ఏర్పాటు చేయనున్నారు. అయితే సంబంధిత రికార్డుల్లో ఇదే వార్డును 23వ వార్డుగా చూపిస్తుండటంతో కౌంటింగ్‌ సమయంలో ఏ వార్డు ఓట్లను ఎక్కడ లెక్కిస్తారు? ఫలితాల ప్రకటనకు ఏ రికార్డును ప్రామాణికంగా తీసుకుంటారు? అనే అంశాలపై తీవ్ర సందిగ్ధత నెలకొంది.

పోలింగ్‌కు ముందు ఆందోళన

జీవీఎంసీ ఎన్నికల పోలింగ్‌కు ఇంకా రెండు రోజులే గడువు ఉండటంతో ఈ వార్డుల గందరగోళం అభ్యర్థులను కలవరపెడుతోంది. నవంబర్‌ 1న ఉదయం 8 గంటల నుంచి 120 వార్డుల్లో పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇలాంటి తరుణంలో ఓటరు జాబితాల్లోని తప్పులు అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. రికార్డుల్లో తేడాల కారణంగా ఓటర్లు తమ పోలింగ్‌ బూత్‌, ఓటరు జాబితాలోని సీరియల్‌ నంబర్లను సులభంగా గుర్తించలేకపోతున్నారు. ఎన్నికల వేళ ఓటరు స్లిప్పుల పంపిణీలోనూ ఈ సమస్య తీవ్ర ఆటంకంగా మారే ప్రమాదం ఉంది. ఒకే కుటుంబానికి చెందిన ఓట్లు వేర్వేరు వార్డుల్లో లేదా వేర్వేరు సీరియల్‌ నంబర్లతో నమోదయ్యే అవకాశం ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ పరిణామాలు ఓటింగ్‌ సరళిపై కూడా ప్రభావం చూపే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓటర్లు తమ ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవాలంటే కచ్చితమైన ఓటరు జాబితా ఎంతో కీలకం. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం అధికారులు, జీవీఎంసీ సిబ్బంది తక్షణమే స్పందించి, ఎన్నికల రికార్డులను క్షేత్రస్థాయి వాస్తవాలతో సరిపోల్చి తప్పులను సవరించాలని ఓటర్లు, అభ్యర్థులు డిమాండ్‌ చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం ప్రజల ప్రజాస్వామిక హక్కులకు విఘాతం కలిగించకూడదని వార్డు ప్రజలు స్పష్టం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement