శ్మశాన వాటికల కొరత సమస్యను
త్వరలోనే పరిష్కరిస్తాం
వైఎస్సార్ సీపీ మేయర్ అభ్యర్థి
వరుదు కల్యాణి
మాధవధారలో వైఎస్సార్‌సీపీ క్రిస్టియన్
మైనారిటీ సెల్ ఆత్మీయ సమావేశం
సాక్షి, విశాఖపట్నం: విశాఖతో పాటు రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో క్రైస్తవ సమాజం ఎదుర్కొంటున్న శ్మశాన వాటికల కొరత సమస్యను వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని ఆ పార్టీ మేయర్ అభ్యర్థి వరుదు కల్యాణి హామీ ఇచ్చారు. నగరంలో కబ్జాకు గురైన, ఆక్రమణల ముప్పును ఎదుర్కొంటున్న చర్చిలు, మిషనరీ సంస్థలకు చెందిన ఆస్తులకు పూర్తి స్థాయి రక్షణ కల్పిస్తామని స్పష్టం చేశారు.గురువారం విశాఖలోని మాధవధారలో ఉన్న ఫంక్షన్ హాల్‌లో వైఎస్సార్‌సీపీ క్రిస్టియన్ మైనారిటీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జాన్ వెస్లీ అధ్యక్షతన క్రైస్తవ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వరుదు కల్యాణి, వైఎస్సార్‌సీపీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా వరుదు కల్యాణి మాట్లాడుతూ.. రాబోయే స్థానిక సంస్థలు, కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి, తనకు మద్దతుగా నిలవాలని క్రైస్తవ సోదరులు, పాస్టర్లను కోరారు. మైనారిటీల సంక్షేమం, వారి హక్కుల పరిరక్షణకు వైఎస్సార్‌సీపీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు.
కేకే రాజు మాట్లాడుతూ క్రైస్తవుల న్యాయమైన సమస్యల పరిష్కారానికి పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులతో పాటు క్రైస్తవ సంఘాల ప్రముఖులు పాల విక్టర్, జోహాన్ వెసలే, రాజశేఖర్, డేవిడ్, పీలా వెంకటలక్ష్మి, రవిరాజు, అల్లంపల్లి రాజుబాబు, వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ అభ్యర్థి సారంగధరుడు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పాస్టర్లు, క్రైస్తవ సంఘాల ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.


