విశాఖ విద్య: స్థానిక సంస్థల ఎన్నికల్లో వివిధ రాజకీయ పార్టీల తరఫున పోటీ చేస్తున్న వెలమ సామాజికవర్గ అభ్యర్థుల విజయానికి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, జీవీఎంసీ మేయర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వరుదు కల్యాణికి మద్దతు ఇస్తున్నట్లు వెలమ సంక్షేమ సంఘం (సెంట్రల్ ఆర్గనైజేషన్) విశాఖ జిల్లా అధ్యక్షుడు చికటి సత్యనారాయణ, కార్యదర్శి యడ్ల సత్యనారాయణ స్పష్టం చేశారు. గురువారం సీతమ్మధారలోని వెలమ భవనంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. వివిధ పార్టీల నుంచి కార్పొరేటర్లుగా పోటీ చేస్తున్న వెలమ అభ్యర్థులను గెలిపించాలని సామాజికవర్గ సభ్యులను కోరారు.
జెండాలను పక్కనపెట్టి గెలిపించాలి
రాజకీయ పార్టీల జెండాలను పక్కనపెట్టి.. ‘మన ఎజెండా.. వెలమ ఐక్యత’ అనే నినాదంతో ముందుకు సాగాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరినీ కలిసి వెలమ అభ్యర్థులకు మద్దతు కూడగట్టాలని సూచించారు. జనాభా ప్రాతిపదికన సామాజికవర్గానికి ఉన్న బలాన్ని, రాజకీయ ప్రాతినిధ్య ఆవశ్యకతను చాటేందుకు ఈ ఎన్నికలను అవకాశంగా మలుచుకోవాలని పిలుపునిచ్చారు. వాట్సాప్ గ్రూపులు, ఇతర సామాజిక మాధ్యమాలు, ఫోన్ కాల్స్, వ్యక్తిగత పరిచయాల ద్వారా వెలమ అభ్యర్థులకు విస్తృతంగా ప్రచారం కల్పించాలని కోరారు. సమావేశంలో సంఘం కోశాధికారి మూడేడ్ల తమ్మినాయుడు, ఉపాధ్యక్షులు పోలా ప్రసాదరావు, సిరికి పోతురాజు, బండారు శివకాశి బాబు, సంయుక్త కార్యదర్శి రంబ సత్యమనాయుడు, మీడియా ఇన్‌చార్జి తమటపు కృష్ణమూర్తి నాయుడు, కార్యవర్గ సభ్యులు చిరికి శ్రీనివాసరావు, గొల్లి వెంకట నాగశేషు, గుల్లేపల్లి తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.


