విశాఖపట్నం: పుట్టినరోజు వేడుక జరుపుకోవాల్సిన ఆ ఇంట తీవ్ర విషాదం అలముకుంది. అర్నబ్ తుపాను ప్రభావంతో విరిగిన విద్యుత్ స్తంభం తలపై పడి ఓ మహిళ ప్రాణాన్ని బలిగొంది. వివరాలివి. సింహాచలం నుంచి గోపాలపట్నం వెళ్లే ప్రధాన రహదారిలోని బాలాజీనగర్(జీవీఎంసీ 120వ వార్డు)లో నేవల్ డాక్‌యార్డు టెక్నీషియన్ కె.ఎం.మనోహర్ తన భార్య మాధవి(43)తో కలిసి నివాసం ఉంటున్నారు. వీరి పిల్లలు తేజశ్విని ఢిల్లీ ఐఐటీలో, కుమారుడు సంపత్ రాజీవ్ ఖరగ్‌పూర్ ఐఐటీలో చదువుతున్నారు. తుపాను ప్రభావంతో మంగళవారం వీచిన భారీ గాలులకు వారి ఇంట ఉన్న చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్ తీగలపై పడ్డాయి. బుధవారం ఉదయం సుమారు 8 గంటల సమయంలో ఇంటి వద్దకు చెత్త బండి రావడంతో, ఇంట్లోని చెత్తను పట్టుకుని మాధవి బయటకు వచ్చింది. చెత్తబుట్టను బయటపెట్టి తిరిగి లోపలికి వెళుతున్న సమయంలో.. బలమైన గాలుల కారణంగా అడుగు భాగం వరకు బలహీనపడిన విద్యుత్ స్తంభం ఒక్కసారిగా ఆమె తలపై కూలింది. తీవ్రంగా గాయపడ్డ మాధవి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మాధవి పుట్టినరోజు కావడంతో, ఉత్సాహంగా పనులు చేసుకుంటున్న సమయంలోనే ఈ ఘోరం జరిగింది. డ్యూటీ ముగించుకుని వస్తున్న భర్త మనోహర్‌కు మార్గమధ్యంలోనే ఈ దుర్వార్త అందడంతో ఆయన గుండెలు పగిలేలా రోదించారు. విగతజీవిగా పడి ఉన్న భార్యను చూసి కన్నీరుమున్నీరుగా విలపించిన తీరు అక్కడివారందరినీ కంటతడి పెట్టించింది. సమాచారం అందుకున్న గోపాలపట్నం సీఐ సన్యాసినాయుడు, ఎస్‌ఐ మారయ్య సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద తీరును పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ విద్యాధరి, భీమిలి ఆర్‌డీవో సంగీత్ మాధుర్, చినగదిలి తహసీల్దార్ పాల్ కిరణ్ అక్కడికి చేరుకుని మనోహర్‌ను, కుటుంబ సభ్యులను ఓదార్చారు.


