ద్వారకానగర్: పోలింగ్, ఓట్ల లెక్కింపు రోజు ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, ప్రశాంతంగా పూర్తి చేసేలా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని నగర పోలీస్ కమిషనర్ డా.శంఖబ్రత బాగ్చి సూచించారు. జీవీఎంసీ ఎన్నికలకు సంబంధించి స్ట్రాంగ్ రూమ్‌లు, హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాల్లో పకడ్బందీ ఏర్పాట్లను బుధవారం ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద భద్రత కట్టుదిట్టంగా ఉండాలని, ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సీపీ ఆదేశించారు. అనంతరం ఎయిర్‌పోర్ట్, గోపాలపట్నం, పెందుర్తి, గాజువాక, న్యూ పోర్టు, మల్కాపురం తదితర పోలీస్ స్టేషన్ల పరిధిలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌లు, హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు, అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలను సీపీ బాగ్చి పరిశీలించి.. సంబంధిత అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. డీసీపీ–2 మేరీ ప్రశాంతి, సంబంధిత ఏసీపీలు, స్టేషన్ అధికారులు, ఎన్నికల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


