జనసేనలో వసూళ్ల పర్వం! | - | Sakshi
Sakshi News home page

జనసేనలో వసూళ్ల పర్వం!

Oct 25 2026 1:17 AM | Updated on Oct 25 2026 1:17 AM

సీట్ల కోసం కోట్లు డిమాండ్‌

రెండు సీట్లకు రూ.కోటి ఇవ్వాలంటూ బేరసారాలు

అధిష్టానమే వసూలు చేయమందంటూ నేతల ప్రచారం

వాయిస్‌ రికార్డుతో బయటపడిన బాగోతం

జిల్లాలో కీలక నేతపైనా అవే ఆరోపణలు

ఆధారాలతో అధిష్టానానికి ఫిర్యాదు

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: జనసేనలో సీట్ల కేటాయింపు పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు పార్టీలో కలకలం రేపుతున్నాయి. ఒక్కో సీటుకు రూ.50 లక్షల చొప్పున డిమాండ్‌ చేయడం.. రెండు సీట్లకు ఏకంగా రూ.కోటి బేరం పెట్టడం.. ఈ వ్యవహారంలో పార్టీ అధిష్టానం పేరునూ ప్రస్తావించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సీట్ల కోసం డబ్బులు డిమాండ్‌ చేసిన వ్యవహారంలో ఇప్పటికే ఓ నేతపై చర్యలు తీసుకున్నట్టు ప్రచారం జరుగుతుండగా.. మరో నేతపైనా విచారణ సాగుతున్నట్టు సమాచారం. ఒక్కో సీటుకు రూ.50 లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్‌ చేసిన ఫోన్‌ సంభాషణల రికార్డింగ్‌ పార్టీ కీలక నేతల చేతికి చేరినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారం బయటకు పొక్కకుండా ఉండేందుకే రికార్డింగ్‌ పంపిన నేతకు పార్టీ పదవి కట్టబెట్టి బుజ్జగించినట్టు ప్రచారం సాగుతోంది. మరోవైపు, సీటుకు రూ.50 లక్షల చొప్పున వసూలు చేయాలని అధిష్టానమే చెప్పిందంటూ సదరు నేత పేర్కొన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే తరహాలో విశాఖ జిల్లాకు చెందిన మరో కీలక నేత కూడా సీట్ల కోసం డబ్బులు డిమాండ్‌ చేసినట్టు కొందరు పార్టీ నేతలు ఆధారాలతో సహా అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఈ ఆరోపణలపై పార్టీ నాయకత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

పదవి ఇచ్చి బుజ్జగింపు!

గతంలో నియోజకవర్గంలో కీలక నేతగా వ్యవహరించిన ఓ నాయకుడి కుటుంబానికి రెండు కార్పొరేటర్‌ సీట్లు దక్కాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఎన్నికల్లోనూ తమ కుటుంబానికి రెండు సీట్లు కేటాయించాలని సదరు నేత కోరినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి వార్డుల వివరాలతో సహా పార్టీ పెద్దలకు ప్రతిపాదనలు సమర్పించినట్టు సమాచారం. అయితే, రెండు సీట్లు కావాలంటే ఒక్కో సీటుకు రూ.50 లక్షల చొప్పున చెల్లించాలని ఓ జనసేన నేత ఫోన్‌లో డిమాండ్‌ చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. అంత మొత్తం చెల్లించలేమని చెప్పిన సదరు నాయకుడు.. ఈ సంభాషణ మొత్తాన్ని రికార్డు చేసినట్టు తెలుస్తోంది. పార్టీ అధిష్టానమే ఒక్కో సీటుకు రూ.50 లక్షలు వసూలు చేయాలని సూచించిందంటూ సదరు నేత చెప్పినట్టు సమాచారం. ఈ ఫోన్‌ సంభాషణల రికార్డింగ్‌ను జనసేనలోని ఓ కీలక నేతకు పంపినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారం బయటకు వస్తే పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందనే ఉద్దేశంతో రికార్డింగ్‌ పంపిన నేతకు నియోజకవర్గ స్థాయిలో కీలక పదవి కట్టబెట్టి బుజ్జగించినట్టు ప్రచారం సాగుతోంది. మరోవైపు, డబ్బులు డిమాండ్‌ చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొన్న నేతపై చర్యలు తీసుకున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయినప్పటికీ, తన కుటుంబానికి సీట్లు దక్కకపోవడంతో సదరు నేత అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. తమకు అన్యాయం జరిగిందంటూ ఆయన పలుచోట్ల వ్యాఖ్యానిస్తున్నట్టు సమాచారం.

పార్టీ ఫండ్‌ గాయబ్‌..!

ఒకవైపు సీట్ల కోసం కోట్లు డిమాండ్‌ చేసిన వ్యవహారంలో ఒక నేతపై చర్యలు తీసుకున్నప్పటికీ మరో నేత మాత్రం అస్సలు తగ్గేదేలే అంటూ వ్యవహారాలు సాగిస్తున్నారు. కూటమి పొత్తులతో వచ్చిన కొద్దిపాటి సీట్లలో సర్దుబాటుకు జనసేన నేతలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇచ్చిన కొద్దిపాటి సీట్లకు డిమాండ్‌ ఉండటంతో ఇదే అదనుగా వసూళ్లకు తెగబడినట్టు తెలుస్తోంది. మీకు సీటు కావాలంటే పార్టీ నుంచి వచ్చే పార్టీ ఫండ్‌ మొత్తం రూ. 25 లక్షలు తనకు ఇవ్వాలని సదరు నేత బేరసారాలకు తెగబడినట్టు తెలుస్తోంది. పార్టీ నుంచి వచ్చే ఫండ్‌ మొత్తం తాను తీసుకుంటానని.. అయినప్పటికీ తమకు అందినట్టు చెబితేనే సీటు ఇస్తాననే షరతు విధించారు. ఈ షరతును అంగీకరించిన నేతలకే పొత్తులో సీట్లు కేటాయించరనే విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ముఖ్యమైన సీట్లను కోరుతున్న కొద్ది మంది నుంచి పార్టీ ఫండ్‌తో పాటు అదనంగా డిమాండ్‌ చేశారని కూడా సమాచారం. ఈ వ్యవహారంపై ఆ పార్టీకి చెందిన కొద్ది మంది నేతలు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. దీంతో బీ ఫారాల మీద సదరు నేత సంతకం లేకుండా అమరావతి నుంచే సంతకం చేసి పంపడతో పాటు వాటిని శివశంకర్‌కు అందజేసినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే, ఎన్నికల తర్వాత సదరు నేత మీద చర్యలు తీసుకుంటారనే చర్చ జరుగుతున్నప్పటికీ.. మొత్తం వ్యవహారమంతా అధిష్టానానికి తెలుసంటూ సదరు నేత వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement