సాక్షి, పాడేరు: పచ్చని కొండలు, దట్టమైన అటవీ ప్రాంతంతో అలరారే అనంతగిరి మండలం పినకోట కొండలు భారీ పేలుడుతో దద్దరిల్లాయి. శనివారం ఉదయం 8.30 గంటల సమయంలో పీచుమామిడి గ్రామ సమీపంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదం ఏడుగురి ప్రాణాలను బలిగొంది. రోడ్డు నిర్మాణ పనులకు వినియోగిస్తున్న వాహనాల వద్ద డీజిల్ నింపుతుండగా మంటలు చెలరేగి, పేలుడు పదార్థాలు, గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనతో మన్యం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురి మృతదేహాలను గుర్తించగా, మరో ఇద్దరి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. పేలుడు ధాటికి మృతదేహాల శరీర భాగాలు చెల్లాచెదురుగా పడడంతో ఘటనాస్థలంలో హృదయవిదారక దృశ్యాలు కనిపించాయి. అనంతగిరి మండలంలోని దాయత్తి రోడ్డులో బల్లగరువు–తునసీబు ప్రాంతాల మధ్య కొత్త రోడ్డు నిర్మాణ పనుల కోసం సామగ్రితో కూడిన క్యాంపర్ వ్యాన్ శనివారం ఉదయం అనకాపల్లి జిల్లా దేవరాపల్లి నుంచి బయలుదేరింది. వ్యాన్‌లో సుమారు 250 లీటర్ల డీజిల్, గ్యాస్ సిలిండర్, కొండరాళ్లను పేల్చేందుకు వినియోగించే జిలెటిన్ స్టిక్స్ ఉన్నట్లు తెలుస్తోంది. కడపకు చెందిన సూపరవైజర్ ఆదిబోయిన గురుప్రవీణ్(27), ఉపాధ్యాయురాలు జాగారపు సునీత(44), దేవరాపల్లికి చెందిన మణికంఠ(23), చీడికాడకు చెందిన నారాయణరావు, పెదబయలుకు చెందిన డ్రైవర్ పాంగి చిరంజీవి(30) వ్యాన్‌లో ప్రయాణిస్తున్నారు. పినకోట దాటిన తర్వాత పీచుమామిడి గ్రామ సమీపంలో రోడ్డు పనులకు వినియోగిస్తున్న మినీ టిప్పర్ ట్యాంకర్‌లో రోజూ మాదిరిగా డీజిల్ నింపుతుండగా మంటలు వ్యాపించినట్లు సమాచారం. దీంతో క్యాంపర్ వ్యాన్‌లోని పేలుడు సామగ్రి, గ్యాస్ సిలిండర్ పేలిపోయాయి. ఒక్కసారిగా సంభవించిన భారీ పేలుడుతో వ్యాన్‌లో ఉన్న ఐదుగురితోపాటు టిప్పర్ వద్ద ఉన్న అసోం, బిహార్‌కు చెందిన డ్రైవర్లు నసీరుద్దిన్, టింకు చంద్రవంశీ సింగ్ ప్రాణాలు కోల్పోయారు.
ఘటనా స్థలానికి క్లూస్ టీంలు
సమాచారం అందుకున్న అనకాపల్లి, అల్లూరి జిల్లాల ఎస్పీలు తుహిన్ సిన్హా, అమిత్ బర్ధర్ సహాయక చర్యలకు పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. పోలీసులు, క్లూస్ బృందాలు ఘటనాస్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించాయి. ఐదుగురి మృతదేహాలను గుర్తించగా, నసీరుద్దిన్, టింకు మృతదేహాల కోసం గాలింపు చేపట్టారు. పేలుడుకు దారితీసిన పరిస్థితులు, వాహనాల్లో తరలిస్తున్న సామగ్రి వివరాలపై అధికారులు విచారణ చేస్తున్నారు.
పినకోటలో భారీ పేలుడు
వ్యాన్‌లో పేలుడు పదార్థాల రవాణా
డీజిల్ నింపుతుండగా మంటలు
దగ్ధమైన వాహనాలు.. ఏడుగురు మృతి
చెల్లాచెదురైన మృతదేహాలు
మృతుల్లో ఉపాధ్యాయురాలు సునీత
మృతుల వివరాలు
ఆదిబోయిన గురుప్రవీణ్ (27),కడపకు చెందిన సూపర్‌వైజర్
ఉపాధ్యాయురాలు జాగారపు సునీత
మణికంఠ(23), దేవరాపల్లి
నారాయణరావు, చీడికాడ
పాంగి చిరంజీవి(30), పెదబయలు
నసీరుద్దిన్, టింకు చంద్రవంశీ సింగ్, అసోం, బిహార్‌కు చెందిన డ్రైవర్లు


