ఆరిలోవ: జీవీఎంసీ 18వ వార్డులో టీడీపీ కార్యాలయం ఏర్పాటు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. గతంలో మద్యం షాపుగా నిర్వహించిన భవనాన్నే ప్రస్తుతం టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి ఎన్నికల కార్యాలయంగా వినియోగిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.జీవీఎంసీ ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీల అభ్యర్థులు తమ ప్రచార కార్యకలాపాల కోసం వార్డుల్లో కార్యాలయాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా కూటమి తరఫున టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి పోటీలో ఉండగా.. కొంతకాలం మద్యం షాపుగా ఉన్న భవనాన్ని ఖాళీ చేసిన అనంతరం అక్కడే పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు.దీంతో ఆ కార్యాలయానికి వచ్చే కొందరు నాయకులకు గతంలో అక్కడ ఉన్న మద్యం షాపు జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయంటూ స్థానికంగా సరదా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ‘అక్కడికి వెళ్తే ఎన్నికల కార్యాలయమా.. పాత మద్యం షాపా అన్న భావన కలుగుతోంది’ అంటూ కొందరు చర్చించుకుంటున్నారు. మరోవైపు, పార్టీ కార్యాలయం ఏర్పాటుకు మరో స్థలం దొరకలేదా? అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల సమయంలో అభ్యర్థుల కార్యాలయాల ఎంపిక కూడా ప్రజల్లో చర్చకు దారితీస్తోంది.


