విశాఖ జలమయం | - | Sakshi
Sakshi News home page

విశాఖ జలమయం

Sep 24 2026 2:36 AM | Updated on Sep 24 2026 2:36 AM

● బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంతో వర్షబీభత్సం ● రెండు రోజుల్లో 12.95 సెం.మీ. వర్షపాతం నమోదు ● నగరంలో నీటమునిగిన రహదారులు, లోతట్టు ప్రాంతాలు ● కై లాసపురం కస్తూరినగర్‌లో విరిగిపడిన కొండచరియలు ● ఈదురు గాలులకు పలు చోట్ల విరిగిన చెట్లు ● నేడు, రేపు భారీ వర్షాల హెచ్చరికలు

సాక్షి, విశాఖపట్నం: ఆకాశానికి చిల్లులు పడ్డాయా.. అన్నట్టుగా రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నగరం అతలాకుతలమైంది. తీవ్ర వాయుగుండం ప్రభావంతో 12.95 సెం.మీ. వర్షపాతం నమోదవగా.. ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొండవాలు ప్రాంతాల్లో చరియలు విరిగిపడుతుండటంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నారు. ఈదురుగాలులకు చెట్లు నేలకొరగడంతో పలుచోట్ల విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సముద్రం ఉగ్రరూపం దాల్చడంతో రుషికొండ బీచ్‌ను మూసివేశారు. మత్స్యకారులను సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరించారు. మరో రెండు రోజులు భారీ వర్షాల హెచ్చరిక నేపథ్యంలో యంత్రాంగం అప్రమత్తమైంది. విశాఖ జిల్లాకు వాతావరణ శాఖ ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసింది.

ఒక్క రోజే 9.4 సెం.మీ. వర్షం : బుధవారం ఒక్క రోజే నగరంలో 9.4 సెం.మీ. వర్షం కురిసింది. ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. జనజీవనం స్తంభించింది. దీంతో నిత్యం రద్దీగా ఉండే రోడ్లు నిర్మానుష్యంగా మారిపోయాయి. వినియోగదారులు లేక మార్కెట్లు బోసిపోయాయి. చిరు వ్యాపారులు సైతం ఇళ్లకే పరిమితమయ్యారు. బలమైన ఈదురు గాలులకు నగరంలో 34 చోట్ల చెట్లు నేలకొరిగాయి. విద్యుత్‌ తీగలపై చెట్లు పడటంతో నగరంలో పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

సాగరతీరం మూసివేత : వర్షాల కారణంగా సాగరతీరంలో పర్యాటకులు, సందర్శులను అనుమతించలేదు. సముద్రంలో ఆటుపోట్లు ఉధృతంగా ఉండటంతో పాటు ఈదురు గాలుల ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రుషికొండ బీచ్‌కు వెళ్లే ప్రధాన రహదారి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి మూసివేశారు.

వర్ష బీభత్సం..

● 46వ వార్డు కై లాసపురం పరిధిలోని కస్తూరినగర్‌లో కొండచరియలు విరిగిపడ్డాయి.

● కొమ్మాది జంక్షన్‌ సమీపంలోని వికలాంగుల కాలనీలో కొండచరియలు జారిపడ్డాయి.

● బుల్లయ్య కళాశాల వద్ద ఫుట్‌పాత్‌పై ఉన్న భారీ వృక్షం నేలకొరిగింది.

● ఎన్‌ఏడీ కొత్తరోడ్డు పరిసర ప్రాంతాల్లో బీఆర్‌టీఎస్‌ రహదారి పూర్తిగా దెబ్బతింది.

● 90వ వార్డు బుచ్చిరాజుపాలెం బస్టాప్‌ ఎదురుగా భారీ గొయ్యి ఏర్పడింది.

● భీమిలి మండలంలో గోస్తనీ నది పోటెత్తి ప్రవహిస్తోంది. టి.నగరపాలెం వద్ద నదికి అడ్డంగా నిర్మించిన మట్టికట్ట కొట్టుకుపోయింది. దీంతో తాటితూరు, టి.నగరపాలెం పంచాయతీల ప్రజలు, రైతులు, విద్యార్థుల రాకపోకలు స్తంభించిపోయాయి.

అపార నష్టం..

● 11 కేవీ ఫీడర్స్‌ –11 డామేజ్‌ అయ్యాయి

● 11 కేవీ ఫోల్స్‌ –3 డామేజ్‌ అయ్యాయి

● 15 ఎల్‌టీ ఫోల్స్‌, 10 డీటీఆర్‌ ఫోల్స్‌ డామేజ్‌ అయ్యాయి

● జీవీఎంసీ పరిధిలో 33 చెట్లు ఇరిగిపోయాయి

● 5.5 కి.మీ రోడ్డులు డామేజ్‌ అయ్యాయి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement