ఏయూ మైదానాల అభివృద్ధిపై
అప్పట్లో టీడీపీ విషప్రచారం
ఇప్పుడు అదే మైదానంలో
బహిరంగ సభల నిర్వహణ
తాజాగా నేడు అదే గ్రౌండ్‌లో
సీఎం పట్టాల పంపిణీ
ఏయూ అభివృద్ధికి రూ.500 కోట్ల హామీ
ఏమైందంటూ విద్యార్థి సంఘాల ప్రశ్న
విశాఖ విద్య: ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) మైదానాల అభివృద్ధిని ఒకప్పుడు కంటిలో నలుసులా చూసి.. పనులపై విష ప్రచారం చేసిన కూటమి నేతలకు.. నేడు అధికారంలోకి వచ్చాక అవే మైదానాలు శరణ్యమయ్యాయి. అప్పట్లో మైదానాల విస్తరణను అడ్డుకోవాలని కుట్రలు పన్నిన నోళ్లే.. ఇప్పుడు అదే విశాలమైన గ్రౌండ్స్‌లో హెలికాప్టర్లతో దిగుతూ.. బహిరంగ సభలు నిర్వహిస్తూ.. ప్రగల్బాలు పలుకుతున్నాయి. గతంలో విశ్వవిద్యాలయ అభివృద్ధిని కక్షపూరితంగా విమర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. నేడు అదే ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ మైదానం వేదికగా పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం ఆయన ద్వంద్వ వైఖరికి అద్దం పడుతోంది.
విశాలంగా మైదానాలు
ఏయూ ప్రధాన మైదానం గతంలో పరిమిత విస్తీర్ణంలో ఉండేది. తుప్పలతో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది. దీంతో 2019–2024 మధ్య మైదానాలను విస్తరించి, వర్సిటీ భూములను రక్షించాలనే ఉద్దేశంతో గత ఏయూ పాలకవర్గం పలు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ ప్రధాన మైదానాన్ని 15 ఎకరాల నుంచి 23 ఎకరాలకు విస్తరించారు. 12 ఎకరాల్లో ‘ఊర్జా’ మైదానాన్ని ఏర్పాటు చేశారు. 15.6 ఎకరాల స్థలంలో హెలిప్యాడ్ నిర్మించి, దాని పక్కనే పార్కింగ్ సదుపాయం కల్పించారు. దీంతో నగరంలో భారీ బహిరంగ సభలతో పాటు హెలికాప్టర్ ల్యాండింగ్‌కు అనువైన మైదానం ఏయూలో అందుబాటులోకి వచ్చింది.
భూముల రక్షణకు చర్యలు
వర్సిటీ భూములను పరిరక్షించడంతో పాటు అందుబాటులో ఉన్న స్థలాలను సద్వినియోగం చేసేలా అప్పటి అధికారులు చర్యలు చేపట్టారు. పొలమాంబ ఆలయం వద్ద సుమారు 12 ఎకరాలు భూమి అన్యాక్రాంతం కాకుండా పరిరక్షించారు. మద్దిలపాలెం బ్లాక్–1 వద్ద కూడా స్థలాన్ని సద్వినియోగంలోకి తీసుకొచ్చారు. అయితే మైదానాల విస్తరణ సమయంలో అభివృద్ధి పనులను అడ్డుకోడానికి అప్పటి ప్రతిపక్ష టీడీపీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది.
ఇప్పుడు అదే వేదికపై..
మైదానాల విస్తరణతో ఏయూలో భారీ కార్యక్రమాలకు అనువైన వేదికలు అందుబాటులోకి వచ్చాయి. ప్రధానమంత్రి సభతో పాటు ముఖ్యమంత్రి పాల్గొనే పలు కార్యక్రమాలు ఇక్కడే జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి సహా వీవీఐపీలు హెలిప్యాడ్‌లో నేరుగా దిగి కార్యక్రమాలకు హాజరవుతున్నారు. గతంలో మైదానాల అభివృద్ధిని వ్యతిరేకించిన వారే ఇప్పుడు వాటిని వినియోగించుకుంటున్నారని విద్యార్థి సంఘాల నేతలు గుర్తు చేస్తున్నారు.
నిధుల విడుదలకు డిమాండ్
ప్రభుత్వ కార్యక్రమాలకు ఏయూ మైదానాలు, హాస్టళ్లు, గెస్ట్‌హౌస్‌లను వినియోగిస్తున్నప్పుడు కనీసం అద్దె అయినా చెల్లించాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. వర్సిటీ అభివృద్ధికి ప్రకటించిన రూ.500 కోట్లను వెంటనే విడుదల చేయాలని, విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంతో పాటు మౌలిక వసతులు కల్పించాలని కోరుతున్నారు. శనివారం జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఈ మేరకు స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
రూ.500 కోట్ల హామీ ఏమైంది?
ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో ఈ ఏడాది ఏప్రిల్ 27న జరిగిన వర్సిటీ శతాబ్ది ఉత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏయూ అభివృద్ధికి రూ.500 కోట్లు కేటాయిస్తామని ప్రకటించారు. అయితే ఇప్పటివరకు నిధులు విడుదల కాలేదని, ఇందుకు సంబంధించిన జీవో కూడా రాలేదని విద్యార్థి సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక శాఖ నుంచి కూడా ఎలాంటి సమాచారం లేదని చెబుతున్నారు. ఇప్పుడు మళ్లీ ఇదే మైదానంలో పట్టాల పంపిణీ కార్యక్రమానికి సీఎం వస్తున్న నేపథ్యంలో.. గత హామీపై ప్రకటన చేయాలని విద్యార్థులు కోరుతున్నారు.


