వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు
సాక్షి, విశాఖపట్నం: ప్రభుత్వ భూముల్లో ఏళ్లుగా నివసిస్తున్న అర్హులైన పేదల ఇళ్లను నిబంధనల మేరకు క్రమబద్ధీకరించి, వారికి శాశ్వత నివాస భద్రత కల్పించాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు శుక్రవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఆగస్టు 31న జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఎన్నికలొస్తేనే చంద్రబాబుకు పేదలు గుర్తొస్తారని, లేకుంటే పేదల బతకుల గురించి కనీసం పట్టించుకోరని ఎద్దేవా చేశారు. జీవో ఎంఎస్ నం.296తో పాటు వర్తించే ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం అర్హత కలిగిన పేదల ఇళ్ల క్రమబద్ధీకరణకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. జీవీఎంసీ ఎన్నికల నేపథ్యంలో హడావుడిగా పేదల ఇళ్ల సమస్యను ప్రభుత్వం తెరపైకి తీసుకురావడం సరికాదన్నారు. ప్రజా సమస్యలను ఎన్నికలతో సంబంధం లేకుండా పరిష్కరించాలని సూచించారు. ప్రకటనలకు పరిమితం కాకుండా స్పష్టమైన ఉత్తర్వులు, పారదర్శక ప్రక్రియ, కాలపరిమితితో కూడిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. జీవితకాల సంపాదనతో ఇళ్లు నిర్మించుకుని దశాబ్దాలుగా నివసిస్తున్న పేద కుటుంబాలకు భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. అర్హులైన ప్రతి కుటుంబాన్ని గుర్తించి క్రమబద్ధీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కేకే రాజు ప్రభుత్వాన్ని కోరారు.


