బిట్‌కాయిన్‌ చుట్టూ రాజకీయ, పోలీసు రగడ | - | Sakshi
Sakshi News home page

బిట్‌కాయిన్‌ చుట్టూ రాజకీయ, పోలీసు రగడ

Sep 19 2026 8:44 AM | Updated on Sep 19 2026 8:44 AM

పౌర గ్రంథాలయం వద్ద హైడ్రామా

పోలీసులపై న్యాయవాదుల ఆరోపణలు

సీపీకి బిట్‌కాయిన్‌ ఇచ్చారా?

విచారణ కోరిన న్యాయవాది

న్యాయవాదుల మీడియా సమావేశాన్ని అడ్డుకున్న సాయిరాం

సాయిరాం ఎమ్మెల్యే అనుచరుడిగా

ప్రచారం

విశాఖ విద్య: బిట్‌కాయిన్‌ వ్యవహారం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నగర పోలీస్‌ కమిషనర్‌కు బిట్‌కాయిన్‌ ఇచ్చారంటూ వచ్చిన ఆరోపణలపై న్యాయవాది గీతా ప్రసన్న హైకోర్టును ఆశ్రయించడం, అనంతరం తనపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆమె ఆరోపించడం కలకలం రేపుతోంది. హైకోర్టు న్యాయవాదులు కార్తీక్‌ సిద్ధార్థ్‌, వంశీకృష్ణ, సుభాష్‌లతో కలిసి శుక్రవారం పౌర గ్రంథాలయంలో మీడియాతో మాట్లాడిన గీతా ప్రసన్న.. బిట్‌కాయిన్‌ అంశంపై ఆధారాలు ఉన్నాయని, వాటిపై విచారణ జరగాలని కోరారు. ఈ విషయాన్ని ప్రశ్నించినందుకే తనను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. విశాఖ పోలీసులు ‘బడ్స్‌’ కేసుల విషయంలో చట్టపరమైన విధానాలను పాటించడం లేదని న్యాయవాది కార్తీక్‌ సిద్ధార్థ్‌ ఆరోపించారు. బాధితుల ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేసి సంబంధిత వ్యవస్థకు అప్పగించాల్సిన పోలీసులు అంతకుమించి వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఈ అంశాలను ప్రశ్నిస్తున్నందుకే గీతా ప్రసన్నతో పాటు ఆమె భర్తపై కూడా కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు.

కరిష్మా కేసులో నేతలున్నారు

కరిష్మా అనే యువతి తనకు అన్యాయం జరిగిందంటూ తనను ఆశ్రయించిందని, కేసు పూర్వాపరాలను పరిశీలించానని న్యాయవాది గీతా ప్రసన్న తెలిపారు. ఈ వ్యవహారం అనేక మలుపులు తిరిగిందని, విశాఖకు చెందిన ఓ ఎమ్మెల్యే, సాయిరాం అనే వ్యక్తి తనను బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఎమ్మెల్యేతో జరిగిన సంభాషణకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకే పోలీసులు, సాయిరాం వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గత మార్చిలో జరిగిన ఈ కేసు విషయంలో ఎమ్మెల్యేతో పాటు పోలీసులు కూడా తనను లక్ష్యంగా చేసుకున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ పోలీసుల తీరుపై ఆగస్టు 17న కోర్టు కూడా స్పందించిందని, న్యాయవాదులపై అక్రమ కేసులు నమోదు చేసే పరిస్థితి ఏర్పడిందని న్యాయవాది కార్తీక్‌ సిద్ధార్థ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. గీతా ప్రసన్నపై మహిళా పోలీస్‌ స్టేషన్‌ ఏసీపీ అంబేడ్కర్‌ బార్‌ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేయడం దారుణమన్నారు. ఏప్రిల్‌లో ఎమ్మెల్యేపై తాను స్వయంగా సీపీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని గీతా ప్రసన్న తెలిపారు.

ప్రెస్‌మీట్‌లో సాయిరాం హల్‌చల్‌

న్యాయవాదులు మీడియాతో మాట్లాడుతున్న సమయంలో కరిష్మా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సాయిరాం అక్కడికి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. తనపై న్యాయవాదులు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని, తన వాదన చెప్పేందుకే వచ్చానని తెలిపారు. దీంతో కొంతసేపు వాగ్వాదం చోటుచేసుకుంది.

కరిష్మా ఆందోళన

ఇదే సమయంలో కరిష్మా పౌర గ్రంథాలయం వద్ద బైఠాయించి తనకు న్యాయం చేయాలని కోరారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, తన హక్కులను కాలరాస్తున్నారని ఆరోపించారు. సమాచారం అందుకున్న ద్వారకా పోలీసులు అక్కడికి చేరుకుని న్యాయవాదులు, కరిష్మా, సాయిరాంను స్టేషన్‌కు తరలించారు.

బిట్‌కాయిన్‌ వ్యవహారంపై ఉత్కంఠ

బిట్‌కాయిన్‌ ఆరోపణల చుట్టూ నెలకొన్న వివాదంలో అసలు వాస్తవాలు ఏమిటన్నది చర్చనీయాంశంగా మారింది. పోలీస్‌ కమిషనర్‌పై ఆరోపణలు రావడంతో ఈ అంశంపై అధికారుల స్పందన ఎలా ఉంటుందన్నది ఆసక్తిగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement