సాక్షి, విశాఖపట్నం: విశాఖ పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా విశాఖపట్నం పోర్టు అథారిటీ సీప్లేన్ క్రూయిజ్ సేవలకు సన్నాహాలు చేస్తోంది. సాగరమాల ప్రాజెక్టులో భాగంగా 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఈ సేవలకు సంబంధించిన డీపీఆర్‌ను సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. ప్రతిపాదిత ఏరోడ్రోమ్ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు కేంద్ర పర్యాటక శాఖ అదనపు కార్యదర్శి సుమన్ బిల్లా గురువారం అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్‌ను సందర్శించారు. కేంద్ర, రాష్ట్ర పర్యాటక శాఖల అధికారులతో కలిసి టెర్మినల్‌లోని సదుపాయాలు, సీప్లేన్ కార్యకలాపాలకు అనుకూల పరిస్థితులను పరిశీలించారు. ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే విశాఖకు పర్యాటకుల రాక పెరగడంతోపాటు స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని అధికారులు భావిస్తున్నారు.


