బ్యాంకర్ల గళం.. కేంద్రానికి సెగ | - | Sakshi
Sakshi News home page

బ్యాంకర్ల గళం.. కేంద్రానికి సెగ

Sep 12 2026 1:42 AM | Updated on Sep 12 2026 1:42 AM

● సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ ● సమ్మెకు సీఐటీయూ మద్దతు

బీచ్‌రోడ్డు/విశాఖ విద్య : బ్యాంకు ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలను కేంద్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని జాతీయ బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య ఉప ప్రధాన కార్యదర్శి ఎ.సుష్మ డిమాండ్‌ చేశారు. శుక్రవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. బ్యాంకు సంఘాల ఐక్య వేదికలో కీలక భాగస్వామిగా ఉన్న జాతీయ బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య మూడు ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం ముందుంచిందని సుష్మ తెలిపారు. ఐదు రోజుల బ్యాంకింగ్‌ విధానం డిమాండ్‌ కొత్తది కాదన్నారు. 2015 ఒప్పందంలోనే రెండో, నాలుగో శనివారాలకు సెలవులు ప్రకటించారని, మిగిలిన శనివారాలకు కూడా సెలవులు కల్పిస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. 2024 మార్చిలో జరిగిన ఒప్పందంలో బ్యాంకుల సంఘం ఇందుకు అంగీకరించిందన్నారు. దీనికి ప్రతిగా ఉద్యోగులు సోమవారం నుంచి శుక్రవారం వరకు 40 నిమిషాలు అదనంగా పనిచేసేందుకు అంగీకరించారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏకీకృత పెన్షన్‌ పథకం ద్వారా హామీ పెన్షన్‌ అవసరాన్ని కేంద్రం గుర్తించినప్పుడు, బ్యాంకు ఉద్యోగులకు ఎందుకు వర్తింపజేయకూడదని ఆమె ప్రశ్నించారు. పదవీ విరమణ తేదీతో సంబంధం లేకుండా అన్ని పెన్షనర్లకు 8,088 పాయింట్ల వరకు కరువు భత్య విలీన ప్రయోజనం, కొత్త ధరల సూచీ ప్రయోజనాలను వర్తింపజేయాలని డిమాండ్‌ చేశారు.

బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు సీఐటీయూ మద్దతు

దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు చేపట్టిన సమ్మెకు సీఐటీయూ జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. సమ్మె సందర్భంగా జీవీఎంసీ వద్ద నిర్వహించిన బహిరంగ సభలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కేవీఎస్‌ కుమార్‌ మాట్లాడుతూ.. బ్యాంకు ఉద్యోగులు చాలా కాలంగా కోరుతున్న సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. ఐక్య పోరాటాల ద్వారానే ప్రభుత్వ విధానాలను ఎదుర్కొనగలమన్నారు. కార్మికులు, ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఎక్కడ పోరాడినా సీఐటీయూ వారికి సంఘీభావంగా నిలుస్తుందని తెలిపారు.

సీతమ్మధారలో..

యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ పిలుపు మేరకు సీతమ్మధార యూనియన్‌ బ్యాంక్‌ ఇండియా కార్యాలయం వద్ద ఉద్యోగులు, అధికారులు సమ్మెలో పాల్గొన్నారు. యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ కన్వీనర్‌ ఆర్‌.వసంతరావు,సీపీఐ కార్యదర్శి సత్యనారాయణ మూర్తి యూనియన్స్‌ నాయకులు అచ్యుతరావు, త్రినాథ్‌, రాజు, మహేంద్ర, కమలాకర్‌, రమేశ్‌, ఏటా ప్రసాద్‌, రవి, ఆడారి శ్రీనివాస్‌, స్వాతి, ప్రత్యూష, వైశాలి, ఆటో యూనియన్‌ నేత పడాల గోవింద్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement