ఫార్మసిస్ట్‌పై హత్యాయత్నం కేసును
ఛేదించిన పోలీసులు
చెల్లెలి ప్రేమ వ్యవహారాన్ని వ్యతిరేకించిందన్న కక్షతో ప్రియుడి ఘాతుకం
అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి షూ లేస్‌తో మెడకు బిగించి హత్యాయత్నం
సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాలతో వీడిన మిస్టరీ
మదనపల్లిలో నిందితుడి అరెస్ట్
అల్లిపురం: చెల్లెలి ప్రేమ వ్యవహారాన్ని వ్యతిరేకించిందన్న కక్షతోనే ఫార్మసిస్ట్‌పై హత్యాయత్నం జరిగినట్లు నిర్ధారణైంది. అల్లిపురంలో గత బుధవారం గంగ తన ఇంట్లో అపస్మారక స్థితిలో ఉండటానికి వెనుక ఉన్న మిస్టరీని రెండో పట్టణ పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఈస్ట్ ఏసీపీ లక్ష్మణమూర్తి శుక్రవారం టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో మీడియాకు వెల్లడించారు.
ప్రేమను వ్యతిరేకించిందని..
పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన మండంగి తులసమ్మ కుమార్తె మండంగి గంగ (34) రామ్‌నగర్‌లోని అపోలో ఫార్మసీలో గత ఎనిమిదేళ్లుగా ఫార్మసిస్ట్‌గా పనిచేస్తోంది. ఆమె భానోజ్‌నగర్‌లోని అగర్వాల్ ఆస్పత్రి డౌన్‌లో తన చెల్లెలు చంద్రమ్మతో కలిసి అద్దె ఇంట్లో నివసిస్తోంది. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలానికి చెందిన బిసాయి ప్రదీప్‌కు గంగ చెల్లెలు చంద్రమ్మతో ప్రేమ వ్యవహారం ఉంది. దీనిని అక్క గంగ తీవ్రంగా వ్యతిరేకించింది. దీంతో ప్రదీప్ ఆమైపె కక్ష పెంచుకున్నాడు. గంగను అడ్డు తొలగించుకుంటేనే తాము ఒక్కటవుతామని భావించిన నిందితుడు ఆమెను హత్య చేయాలని పథకం పన్నాడు.
అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి..
గత మంగళవారం అర్ధరాత్రి సుమారు 12:30 గంటల సమయంలో గంగ ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్న సమయాన్ని ప్రదీప్ ఆసరాగా చేసుకున్నాడు. ఎవరికీ తెలియకుండా ఇంట్లోకి ప్రవేశించి, తన వెంట తెచ్చుకున్న షూ లేస్‌తో ఆమె మెడకు బిగించాడు. అనంతరం చేతులను వెనక్కి కట్టి హత్య చేయడానికి ప్రయత్నించాడు. గంగ స్పృహ కోల్పోయి మృతి చెందిందని భావించి నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు.
చికిత్స పొందుతున్న బాధితురాలు..
బుధవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో గంగ ఆరోగ్యం విషమంగా ఉందన్న సమాచారంతో కుటుంబ సభ్యులు ఆమెను అపోలో ఆస్పత్రికి తరలించారు. గంగ మెడపై తాడు బిగించిన ఆనవాళ్లు, తలకు చుట్టిన టవల్‌పై రక్తపు మరకలు ఉండటంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి తల్లి మండంగి తులసమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం గంగ అపోలో ఆస్పత్రి ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ప్రత్యేక బృందాలతో నిందితుడి అరెస్ట్
ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు సాక్షులను విచారించడంతో పాటు పరిసర ప్రాంతాల సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాలు, సీడీఆర్‌లను క్షుణ్ణంగా పరిశీలించారు. నిందితుడిని పట్టుకునేందుకు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితుడి ఆచూకీని గుర్తించి, అన్నమయ్య జిల్లా మదనపల్లిలో బిసాయి ప్రదీప్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు ఏసీపీ తెలిపారు. ఈ సమావేశంలో టూటౌన్ సీఐ బండారు అప్పలనాయుడు, మహారాణిపేట సీఐ జి.గోవిందరావు పాల్గొన్నారు.


