గణేష్ మండపాలకు
ఉచిత విద్యుత్తు అంటూ ప్రకటనలు
పరిమితులు దాటితే భారం తప్పుదంటూ
అధికారుల మెలిక
దరఖాస్తుల ప్రక్రియతో నిర్వాహకులకు తిప్పలు
ఖరీదైన సెక్యూరిటీ నిబంధనలతో అదనపు భారం
కాంక్రీట్ నగరాల్లో ‘ఎర్తింగ్’ కుదిరేనా?
విద్యుత్ అలంకరణలపైనా ఆంక్షల పర్వం
బాధ్యతంతా ఉత్సవ కమిటీలపైనే నెట్టేసిన శాఖ
సాక్షి, విశాఖపట్నం: ‘గణేష్ మండపాలకు ఉచితంగా విద్యుత్ అందిస్తున్నాం’.. ఈ ప్రకటన వినడానికి ఎంతో సంతోషంగా ఉన్నా, ఆ ‘ఉచితం’ వెనుక అధికారులు విధించిన షరతులు చూస్తే ఉత్సవ కమిటీలకు కరెంట్ షాక్ తగులుతోంది. భక్తిశ్రద్ధలతో, ఉత్సాహంగా పండుగ చేసుకుందామనుకున్న భక్తులపై భద్రత పేరుతో మోయలేని భారాన్ని మోపుతున్నారు. క్షేత్రస్థాయికి ఏమాత్రం పొంతనలేని, ఆచరణ సాధ్యంకాని నిబంధనలతో సామాన్యుల ఉత్సాహంపై చన్నీళ్లు చల్లుతున్నారు. పండుగ పూట వెలుగులు నింపాల్సిన విద్యుత్ శాఖ.. తాము విధించిన షరతులతో మండపాల నిర్వాహకులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
పరిమితి దాటితే భారీ బిల్లులు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏపీఈపీడీసీఎల్ వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ సరఫరా ప్రకటనైతే చేసింది కానీ, అందులో విధించిన ఆంక్షలు చూస్తే ఎవరైనా విస్తుపోవాల్సిందే. గ్రామీణ ప్రాంతాల్లో 3 కిలోవాట్లు, పట్టణాల్లో 5 కిలోవాట్లు మాత్రమే లోడ్‌కు అనుమతిస్తామని షరతు పెట్టింది. సాధారణంగా మండపాల వద్ద కాంతి, ధ్వని ఏర్పాట్లు కాస్త భారీగానే ఉంటాయి. ఈ కొద్దిపాటి లోడ్ ఆ అలంకరణలకు ఏమాత్రం సరిపోదు. ఒకవేళ ఆ పరిమితి దాటితే సాధారణ తాత్కాలిక కనెక్షన్ కింద ఛార్జీలు వసూలు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. దీంతో ఉచితం పేరుతో చివరకు భారీ బిల్లులు కట్టక తప్పదన్న ఆందోళన ఉత్సవ కమిటీల్లో నెలకొంది.
కార్యాలయాల చుట్టూ తిరగక తప్పదు
ఈ ’ఉచిత’ కనెక్షన్ పొందడం అంత తేలికై న వ్యవహారమేమీ కాదు. దీనికోసం నిర్వాహకులు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిందే. నిర్ణీత నమూనాలో వివరాలు నమోదు చేసి, అనుమతులు తీసుకుంటేనే కనెక్షన్ ఇస్తారు. అలా కాకుండా అనధికారికంగా విద్యుత్తు వాడితే దొంగతనం కింద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. పండుగ ఏర్పాట్ల హడావుడిలో ఉండే యువతకు దరఖాస్తుల ప్రక్రియ, ఆఫీసుల చుట్టూ తిరగడం అదనపు భారంగా మారింది.
సామాన్య భక్తులకు గుదిబండ
వీధుల్లో చిన్నపాటి మండపాలు ఏర్పాటు చేసే సామాన్యులపైనా విద్యుత్ శాఖ ఖరీదైన నిబంధనలు రుద్దుతోంది. డిస్ట్రిబ్యూషన్ బోర్డులు వాటర్‌ప్రూఫ్‌గా ఉండాలని, వాటిలో ఎంసీబీ లేదా ఈఎల్‌సీబీలతో పాటు తగిన సామర్థ్యం ఉన్న ఫ్యూజ్ వాడాలని స్పష్టం చేసింది. స్థానికంగా తెలిసిన వారితో తక్కువ ఖర్చుతో పనులు చేయించుకునేవారికి ఈ భద్రతా ఏర్పాట్లు తలకు మించిన ఆర్థిక భారంగా పరిణమించాయి. క్షేత్రస్థాయి పరిస్థితులకు ఏమాత్రం పొంతనలేని విధంగా ఈపీడీసీఎల్ ఎర్తింగ్ నిబంధనలున్నాయి. ప్రతి మండపానికి తప్పనిసరిగా ప్రత్యేక ఎర్తింగ్ ఉండాలని, ఆ రాడ్ తడి నేలలో పాతాలని అధికారులు ఆదేశించారు. కాంక్రీట్ రోడ్లు, ఇరుకై న అపార్ట్‌మెంట్ల మధ్య వెలిసే మండపాలకు నగరాల్లో తడి నేల ఎక్కడినుంచి తేవాలని నిర్వాహకులు ప్రశ్నిస్తున్నారు.
వెలుగులపైనా ఆంక్షలే..
వినాయక మండపాలుండే వీధుల్లో చేసే విద్యుత్ అలంకరణలపైనా అధికారుల ఆంక్షలు కొనసాగుతున్నాయి. పాత బల్బులు వాడకూడదని, కేవలం ఎల్‌ఈడీలే వినియోగించాలని హుకుం జారీ చేశారు. ఐఎస్‌ఐ మార్క్ ఉన్న నాణ్యమైన వైర్లనే వాడాలని, జాయింట్లు లేకుండా ఇన్సులేషన్ టేపులు వేయాలని స్పష్టం చేశారు. సీరియల్ సెట్లు, లైట్లు గోడలకు నేరుగా తగలకుండా ఏర్పాటు చేయడం, మల్టీ–ప్లగ్ ఓవర్‌లోడింగ్ చేయకూడదని చెప్పడం నిర్వాహకులను అయోమయానికి గురిచేస్తోంది. ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యతంతా నిర్వాహకులపై నెట్టేసే విధంగా విద్యుత్ శాఖ అధికారులు చేతులు దులుపుకోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


