సృజనశీలురు.. బాలమేధావులు | - | Sakshi
Sakshi News home page

సృజనశీలురు.. బాలమేధావులు

Sep 11 2026 8:04 AM | Updated on Sep 11 2026 8:04 AM

● జాతీయ స్థాయి ఇన్‌స్పైర్‌కు విశాఖ విద్యార్థులు ● జిల్లా నుంచి మూడు ప్రాజెక్టులు ఎంపిక

ఆరిలోవ : ఆలోచనకు పదునుపెడితే అద్భుతాలు సృష్టించవచ్చని విశాఖ జిల్లా విద్యార్థులు నిరూపించారు. వారిలోని సృజనాత్మకత, శాసీ్త్రయ దృక్పథం జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టాయి. ప్రతిష్టాత్మక ’ఇన్‌స్పైర్‌ మనక్‌’ జాతీయ స్థాయి పోటీలకు విశాఖ జిల్లా నుంచి మూడు వినూత్న ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. గత రెండేళ్లుగా (2024, 2025) కరోనా తదితర కారణాల వల్ల జాతీయ పోటీలు నిర్వహించకపోవడంతో, ఈసారి న్యూఢిల్లీలో నిర్వహించనున్న పోటీల్లో 2023–24, 2024–25 విద్యాసంవత్సరాలకు ఎంపికై న విద్యార్థులకు తమ ఆవిష్కరణలను ప్రదర్శించే అవకాశం లభించిందని జిల్లా సైన్స్‌ అధికారి రాజారావు తెలిపారు.

డీఈవో అభినందనలు

జాతీయ స్థాయికి ఎంపికై న బాలమేధావులు యశస్విని, హారిక, మహేష్‌లను డీఈవో ఎన్‌.ప్రేమకుమార్‌, సైన్స్‌ కోఆర్డినేటర్‌ రాజారావు ప్రత్యేకంగా అభినందించారు. జిల్లా నుంచి మరిన్ని వినూత్న ఆలోచనలు వెలికితీసేలా, రాబోయే రోజుల్లో మరింత మంది విద్యార్థులు ఇన్‌స్పైర్‌ మనక్‌కు ఎంపికయ్యేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని సూచించారు.

జాతీయ స్థాయికి ఎంపికై న ప్రాజెక్టుల విశేషాలు

చంద్రునిపై భవిష్యత్‌ ఇంధన అన్వేషణ

రూపొందించిన విద్యార్థిని: గుంట యశస్విని

(9వ తరగతి, కేథరిన్‌ పబ్లిక్‌ స్కూల్‌, భీమిలి– 2023–24)

ప్రాజెక్టు ప్రత్యేకత: భూమిపై ఇంధన వనరులు తగ్గిపోతున్న తరుణంలో, భవిష్యత్‌ తరాల అవసరాల కోసం చంద్రుడిపై లభించే ఇంధన వనరులను ఎలా అన్వేషించవచ్చో, వాటిని మానవాళికి ఏ విధంగా వినియోగించుకోవచ్చో ఈ ప్రాజెక్టు ద్వారా యశస్విని అత్యంత స్పష్టంగా వివరించింది.

డిటాచింగ్‌ రైల్వే బ్రిడ్జి

రూపొందించిన విద్యార్థిని: కర్రోతు హారిక (విద్యాసాగర్‌ పాఠశాల, భీమిలి– 2024–25)

ప్రాజెక్టు ప్రత్యేకత: రైలు ప్రమాదాలను నివారించడంతో పాటు జలమార్గాల్లో రవాణాకు అంతరాయం కలగకుండా ఈ వంతెనను రూపొందించారు. సాధారణ సమయంలో రైళ్ల రాకపోకల కోసం మూసి ఉండే ఈ వంతెన, నీటి మార్గం ద్వారా ఓడలు లేదా పడవలు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఒక భాగాన్ని పైకి ఎత్తడం, దించడం చేస్తుంది. ప్రాథమిక విద్యుత్‌ నియంత్రణ ద్వారా యాంత్రిక కదలికలు జరిగేలా దీనిని డిజైన్‌ చేశారు.

ఐవోటీ (ఆర్‌ఎఫ్‌ఐడీ) వాటర్‌ ట్యాప్స్‌

రూపొందించిన విద్యార్థి: బి.మహేష్‌ (10వ తరగతి, డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ గురుకులం, శ్రీకృష్ణాపురం–2024–25)

ప్రాజెక్టు ప్రత్యేకత: పాఠశాలలు, గురుకులాలు, విద్యార్థుల వసతి గృహాల్లోని స్నానపు గదులు, మరుగుదొడ్లలో ట్యాప్స్‌ నుంచి జరిగే నీటి వృథాను అరికట్టడానికి ఈ సాంకేతికత ఎంతగానో ఉపయోగపడుతుంది. చాలా తక్కువ విద్యుత్‌ వినియోగంతో పనిచేసే ఈ ఐవోటీ ట్యాప్స్‌ సమాజానికి ఎంతో ఉపయోగకరం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement