నీటి కోసం జాగారం.. మహిళల ఆందోళన | - | Sakshi
Sakshi News home page

నీటి కోసం జాగారం.. మహిళల ఆందోళన

Sep 11 2026 8:04 AM | Updated on Sep 11 2026 8:04 AM

● ఎండాడ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ వద్దకు తరలివచ్చిన లక్ష్మివానిపాలెం వాసులు ● అర్ధరాత్రి నీటి సరఫరా.. కనీసం నాలుగైదు బిందెలు కూడా రావడం లేదని ఆవేదన

మధురవాడ: అర్ధరాత్రి జీవీఎంసీ తాగునీటి సరఫరా.. అదీ సన్నటి ధార.. కనీసం నాలుగైదు బిందెలు కూడా నిండటం లేదంటూ పీఎంపాలెం 6వ వార్డు లక్ష్మివానిపాలెం మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు నెలలుగా రోజు తప్పించి రోజు కుళాయిల ద్వారా అరకొరగా నీరు వస్తోందని, దీంతో చెంబులు, పల్లాలు, లోటాలతో నీరు పట్టుకోవాల్సి వస్తోందని వాపోయారు. సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాకపోవడంతో గురువారం లక్ష్మివానిపాలెం నుంచి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలోని ఎండాడ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ వద్దకు మహిళలు తరలివచ్చి నిరసన చేపట్టారు. పీఎంపాలెం రెండో బస్టాప్‌ సమీపంలోని లక్ష్మివానిపాలెం పరిసర ప్రాంతాల్లో సుమారు 400 కుటుంబాలు నివసిస్తున్నాయని మహిళలు తెలిపారు. రాత్రి 9 గంటల నుంచి 11.30 గంటల మధ్య నీరు సరఫరా చేస్తున్నారని, అదీ సన్నటి ధారగా రావడంతో రాత్రివేళల్లో జాగారం చేయాల్సి వస్తోందన్నారు. తమకు తాగునీరు సరఫరా చేసే వరకు కదిలేది లేదంటూ జీవీఎంసీ తాగునీటి విభాగం డీఈఈ కార్యాలయం ఎదుట బైఠాయించారు.

ట్యాంకర్ల ద్వారా సరఫరా

కుళాయిల ద్వారా రోజు తప్పించి రోజు నీరు సరఫరా చేయడంతో పాటు, జీవీఎంసీ వాటర్‌ ట్యాంకర్‌ ద్వారా ప్రతిరోజూ ఉదయం 11 గంటలకు నీరు అందిస్తామని తాగునీటి విభాగం ఏఈ సురేష్‌ హామీ ఇచ్చారు. సిబ్బంది అందుబాటులో ఉండి ప్రజల సమస్యలపై సావధానంగా స్పందించాలని ఆదేశించారు. తాగునీటికి సంబంధించిన ఇబ్బందులను తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. దీంతో మహిళలు ఆందోళన విరమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement