అచ్యుతాపురం రూరల్ : పెన్షన్ దరఖాస్తు చేసుకునేందుకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు గీత కార్మికులను వెనుక నుంచి వేగంగా వచ్చిన బైక్ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటన బుధవారం మండల కేంద్రమైన అచ్యుతాపురానికి కూత వేటు దూరంలో ఉన్న వెదురువాడ గ్రామ సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మెట్టధర్మవరం గ్రామానికి చెందిన గీత కార్మికులు పెంకే మారయ్య (53), రెడ్డి అప్పారావు (53) బుధవారం ఉదయం 10 గంటల సమయంలో టీవీఎస్ మోపేడ్ (ఏపీ40హెచ్‌జీ8272) నెంబరు గల ద్విచక్ర వాహనంపై వెదురువాడ సచివాలయానికి బయలు దేరారు. మారయ్య వాహనం నడుపుతుండగా, అప్పారావు వెనుక కూర్చు న్నారు. పూడి ఆర్‌అండ్‌ఆర్ కాలనీ కూడలికి సుమారు 100 మీటర్ల దూరంలో యలమంచిలి వైపు నుండి వేగంగా, అజాగ్రత్తగా వచ్చిన గ్లామర్ బైక్ (ఏపీ31డీజెడ్7909) వారి వాహనాన్ని బలంగా ఢీకొంది. ప్రమాదంలో మారయ్య, అప్పారావులకు తీవ్రంగా గాయాలు కావడంతో రోడ్డుపై పడిపో యారు. వెంటనే అంబులెన్స్‌లో అనకాపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్‌కు తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో రెడ్డి అప్పారావు మృతి చెందగా, అదే రోజు రాత్రి 11.30 గంటల సమయంలో పెంకే మార య్య కూడా మృతి చెందారు. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు కుటుంబ పెద్దలు మృత్యువాత పడడంతో ఆ కుటుంబాల్లో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి.


