సీతంపేట: నగర జనాభాలో 50 శాతానికిపైగా కాపులు ఉన్నప్పటికీ ఇప్పటి వరకు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి నగర మేయర్‌గా కాలేకపోయారని కాపుసేన రాష్ట్ర అధ్యక్షుడు బి. నారాయణమూర్తి అన్నారు. ఆంధ్రప్రదేశ్ కాపుసేన ఆధ్వర్యంలో శంకరమఠం రోడ్డులోని ఓ హోటల్‌లో గురువారం కాపు ముఖ్య నేతల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న జీవీఎంసీ ఎన్నికల్లో అధికార, ప్రతిపక్ష రాజకీయ పార్టీలు మేయర్ అభ్యర్థిగా కాపులకు అవకాశం కల్పిస్తే కాపులంతా ఐక్యంగా పనిచేసి ఆ అభ్యర్థిని గెలిపించుకుంటామని అన్నారు.
విశాఖ మున్సిపాలిటీ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు కాపులు మేయర్ కాలేకపోవడం ఆవేదన కలిగించే అంశమన్నారు. ఈ లోటును తీర్చేలా టీడీపీ, బీజేపీ, జనసేన, వైఎస్సార్‌సీపీ పార్టీలు కాపు అభ్యర్థిని మేయర్ అభ్యర్థిగా ప్రకటిస్తే కాపుసేన పూర్తి మద్దతు అందిస్తుందని తెలిపారు. సమావేశంలో కాపుసేన నాయకులు గొల్లకోట వెంకట సుబ్బారావు, చంద్రమౌళి, దాసరి రాధాకృష్ణ, లంకా భాస్కరరావు, కాసాపు సత్యనారాయణ, పెద్దిశెట్టి ఉషశ్రీ, పీలా వెంకటలక్ష్మి, గాదె బాలాజీ, ముక్కా కిషోర్, పోతు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


