మహారాణిపేట: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫొటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా (పీఏఐ) ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ ఫొటోగ్రఫీ పోటీల్లో సాక్షి ఫొటోగ్రాఫర్లకు అవార్డులు లభించాయి. ‘నా భారతదేశం..80 ఏళ్ల ప్రజాస్వామ్యం, స్వాతంత్య్రం’ అనే ఇతివృత్తంతో జాతీయ ఫొటోగ్రఫీ పోటీ–2026ను నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఉన్న ఫొటోగ్రాఫర్ల నుంచి ఈ పోటీకి విశేష స్పందన లభించింది. 16 రాష్ట్రాలకు చెందిన 182 మంది ఫొటో కళాకారులు మొత్తం 352 చిత్రాలను పోటీకి సమర్పించారు. ఈ పోటీల్లో సాక్షి అసిస్టెంట్ చీఫ్ ఫొటోగ్రాఫర్ పీఎల్ మోహన్ రావు, స్టాఫ్ ఫొటోగ్రాఫర్ ఎమ్‌డీ నవాజ్‌లు జాతీయ స్థాయిలో ఉత్తమ ఫొటోగ్రాఫర్లుగా ఎంపికయ్యారు. విజేతలకు అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా గుంటూరులోని నాగార్జున సాగర్ యూనివర్సిటీ ఆడిటోరియంలో అవార్డుల ప్రదానోత్సవం నిర్వహిస్తారు. అవార్డులు అందుకున్న ఇద్దరు ఫొటోగ్రాఫర్లను పలువురు అభినందించారు.


