అల్లిపురం: ప్రభుత్వ పథకాల కింద రుణాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలు, పార్ట్‌టైమ్, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి డబ్బులు వసూలు చేస్తున్న మట్ట కామరాజు(51)ను విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. పీఎంఈజీపీ, ముద్ర పథకాల కింద రూ.10–15 లక్షల వరకు రుణాలు ఇప్పిస్తానని నిందితుడు నమ్మబలికాడు. ప్రాసెసింగ్ ఫీజు, సెక్యూరిటీ డిపాజిట్, ప్రాజెక్ట్ రిపోర్టు, ఉద్యోగ శిక్షణ తదితర చార్జీల పేరుతో పలువురి నుంచి సుమారు రూ.50 లక్షలు వసూలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. రూ.10 లక్షల రుణం ఇప్పిస్తానని చెప్పి ఓ బాధితుడి నుంచి రూ.65,700 వసూలు చేసి, మోసం చేసిన కేసులో నిందితుడిని సాంకేతిక ఆధారాలతో పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 6 మొబైల్ ఫోన్లు, 22 సిమ్ కార్డులు, డెస్క్‌టాప్, 4 డైరీలు, చెక్‌బుక్‌లు, 3 స్టాంప్ ప్యాడ్‌లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా కోర్టు రిమాండ్ విధించింది.


