సీతంపేట: విశాఖలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఏళ్ల తరబడి పనిచేస్తున్న కాంట్రాక్ట్, నాన్ పర్మినెంట్, తాత్కాలిక కార్మికులకు ప్రభుత్వం నిర్ణయించిన కనీస వేతనాలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని సీఐటీయూ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. బుధవారం అక్కయ్యపాలెంలోని రీజనల్ లేబర్ కమిషనర్ ఆఫీస్ వద్ద సిటూ నాయకులు, కార్మికులు ధర్నా చేసి, అధికారులకు వినతిపత్రం అందించారు.. ఈ సందర్భంగా జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శి ఆర్.కె.ఎస్.వి.కుమార్, ఉపాధ్యక్షుడు బి.జగన్‌లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సంస్థల కార్యకలాపాలను కొనసాగించడంలో కీలక పాత్ర పోషిస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు చట్టబద్ధంగా అందాల్సిన వేతనాలు, సంక్షేమ సౌకర్యాలు అనేక చోట్ల పూర్తిస్థాయిలో అమలు కావడం లేదన్నారు. లేబర్ కమిషనర్ కార్యాలయం పరిధిలో ఇప్పటికే దాఖలైన పలు కార్మిక వివాదాలు, ఫిర్యాదులు, కేసులు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉండటం ఆందోళనకరమని పేర్కొన్నారు. కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా.. కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న యాజమాన్యాలు, కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైల్వే కాంట్రాక్ట్ వర్కర్ సీనియర్ రాష్ట్ర కార్యదర్శి వి.వి.ఎల్.నరసింహులు, స్టీల్‌ప్లాంట్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి నమ్మి రమణ, సత్యవతి, సోమేష్, రైల్వే వేగన్ వర్క్‌షాప్ యూనియన్ నాయకులు ఎం.రాంబాబు, అవతారం, రాజుతల్లి, షిప్‌యార్డ్ యూనియన్ నాయకులు పెంటారావు, పోర్ట్ యూనియన్ నాయకులు శ్రీను, నూకరాజు తదితరులు పాల్గొన్నారు.


