అంతర్రాష్ట్ర చైన్‌ స్నాచింగ్‌ దొంగల అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

అంతర్రాష్ట్ర చైన్‌ స్నాచింగ్‌ దొంగల అరెస్ట్‌

Sep 10 2026 3:50 AM | Updated on Sep 10 2026 3:50 AM

● నాలుగు రోజుల్లోనే పట్టుకున్న పోలీసులు ● మీడియా సమావేశంలో వెల్లడించిన క్రైం ఏసీపీ వెంకటరావు

మధురవాడ: వృద్ధురాలి మెడలో నుంచి అపహరించిన బంగారు నల్లపూసల తాడును స్వాధీనం చేసుకుని, ఇద్దరు అంతర్రాష్ట్ర చైన్‌ స్నాచర్లను పీఎంపాలెం పోలీసులు నాలుగు రోజుల్లోనే అరెస్టు చేశారు. ఈ వివరాలను పీఎంపాలెం క్రైం పోలీస్‌ స్టేషన్‌లో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో క్రైం ఏసీపీ వెంకటరావు, ఇన్‌స్పెక్టర్‌ బీఎస్‌ఎస్‌ ప్రకాశ్‌ వెల్లడించారు. పీఎంపాలెం షిప్‌యార్డు లేఅవుట్‌లో నివాసం ఉంటున్న పాంగ పుణ్యవతి (64) ఈ నెల 5న సాయంత్రం 5 గంటల సమయంలో పీఎంపాలెం డబుల్‌ రోడ్డు సమీపంలోని విజేత సూపర్‌ మార్కెట్‌ వద్ద నుంచి తన రాయల్‌ అపార్ట్‌మెంట్‌కు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులు ఆమెను వెంబడించి, మెడలోని బంగారు నల్లపూసల గొలుసును తెంపుకుని పరారయ్యారు. అయితే పుణ్యవతి గొలుసును గట్టిగా పట్టుకోవడంతో కొంత భాగం ఆమె చేతిలోనే ఉండగా, మిగిలిన భాగాన్ని దొంగలు అపహరించారు. ఈ ఘటనతో ఆమె షాక్‌కు గురై కిందపడిపోయారు. స్థానికులు వెంటనే పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కు, 112కు సమాచారం అందించడంతో క్రైం డీఎస్‌ఐ ప్రకాశరావు సిబ్బందితో కలిసి పది నిమిషాల్లో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నార్త్‌జోన్‌ క్రైం ఇన్‌స్పెక్టర్‌ బీఎస్‌ఎస్‌ ప్రకాశ్‌ ఆధ్వర్యంలో పోలీసులు సీసీ కెమెరాలు, ఇతర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితుల కదలికలను గుర్తించారు. వారు అద్దెకు తీసుకున్న వాహనం వివరాలను సేకరించి, దాని ఆధారంగా నిందితులను గుర్తించారు. చోరీ అనంతరం నిందితులు విజయవాడకు వెళ్లినట్లు గుర్తించిన పోలీసులు అక్కడి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారు ఇతర నేరాలకు పాల్పడకుండా అప్రమత్తం చేశారు. అనంతరం నిందితులు తమ స్వస్థలమైన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌ జిల్లా సర్ధానాకు వెళ్లినట్లు గుర్తించిన పీఎంపాలెం పోలీసులు అక్కడికి వెళ్లి కమిల్‌ మాలిక్‌ (30), జావేద్‌ మాలిక్‌ (31)లను అరెస్టు చేశారు. చాకచక్యంగా వ్యవహరించి కేవలం నాలుగు రోజుల్లోనే అంతర్రాష్ట్ర నిందితులను పట్టుకుని, సుమారు 14 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న పీఎంపాలెం క్రైం పోలీసులను ఏసీపీ వెంకటరావుతోపాటు ఇతర ఉన్నతాధికారులు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement