13 ఏళ్ల కన్నీటి వేదనకు తెర | - | Sakshi
Sakshi News home page

13 ఏళ్ల కన్నీటి వేదనకు తెర

Sep 10 2026 3:50 AM | Updated on Sep 10 2026 3:50 AM

● చనిపోయాడనుకున్న కన్న కొడుకు సజీవంగా ఇంటికి ● మానసిక వైకల్యంతో 13 ఏళ్లుగా వేర్వేరు చోట్ల ఆశ్రయం

ఎన్‌ఏడీ జంక్షన్‌: పదమూడేళ్ల క్రితం కుటుంబ సభ్యుల నుంచి తప్పిపోయిన కుమారుడు చనిపోయి ఉంటాడని భావించిన ఆ తల్లిదండ్రులకు ఒక్కసారిగా అతడు సజీవంగా కళ్లముందు కనిపిస్తే.. ఆ ఆనందం మాటల్లో వర్ణించలేనిది. ఎన్‌ఏడీ కొత్తరోడ్డులో జరిగిన ఓ మానవీయ ఘటన ఆ కుటుంబంలో తిరిగి సంతోషాన్ని నింపింది. జీవీఎంసీ నైట్‌ షెల్టర్‌ సిబ్బంది, శ్రద్ధ ఫౌండేషన్‌ సమష్టి కృషితో 13 ఏళ్లుగా ఆచూకీ లేని వినోద్‌ తన కుటుంబ సభ్యుల చెంతకు చేరాడు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని రాంపుర గ్రామానికి చెందిన వినోద్‌ 13 ఏళ్ల క్రితం కుటుంబ సభ్యుల నుంచి తప్పిపోయాడు. కొంతకాలానికి మానసిక స్థితి కోల్పోయాడు. 2025 సెప్టెంబరులో ఎన్‌ఏడీ కొత్తరోడ్డు పరిసరాల్లో దిక్కుతోచని స్థితిలో తిరుగుతుండగా 90వ వార్డు బుచ్చిరాజుపాలెం జీవీఎంసీ నైట్‌ షెల్టర్‌ మేనేజర్‌ ఎల్లేటి మమత గమనించారు. వెంటనే అతడికి నైట్‌ షెల్టర్‌లో ఆశ్రయం కల్పించి, మానసిక ఆస్పత్రిలో చేర్పించి వైద్యం అందించారు.

కోలుకున్నాక వివరాలు వెల్లడి : చికిత్సతో క్రమంగా కోలుకున్న వినోద్‌ తన పేరు, స్వస్థలం రాంపుర గ్రామమని తెలిపాడు. దీంతో మమత ఈ విషయాన్ని శ్రద్ధ ఫౌండేషన్‌ ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. ఫౌండేషన్‌ సభ్యులు వివరాలను ఆధారంగా చేసుకుని ఉత్తరప్రదేశ్‌లోని వినోద్‌ కుటుంబ సభ్యులను గుర్తించి సమాచారం అందించారు. అనంతరం వినోద్‌ను వారి చెంతకు చేర్చారు.

అవధుల్లేని ఆనందం : 13 ఏళ్లుగా చనిపోయాడనుకున్న కుమారుడు సజీవంగా తమ ముందుకు రావడంతో కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. కుమారుడిని ఆప్యాయంగా హత్తుకుని ఆనందభాష్పాలతో వారు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ దృశ్యం తమను తీవ్రంగా కదిలించిందని ఫౌండేషన్‌ సభ్యులు బుధవారం మీడియాకు తెలిపారు. తమ కుమారుడిని తిరిగి తమ చెంతకు చేర్చిన నైట్‌ షెల్టర్‌ సిబ్బందికి, శ్రద్ధ ఫౌండేషన్‌ ప్రతినిధులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement