సబ్బవరం: పిడుగు రూపంలో వచ్చిన ప్రకృతి విపత్తు ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. మండలంలోని అంతకాపల్లి శివారు రావలమ్మపాలేనికి చెందిన రైతు సబ్బవరపు శ్రీరామ్(54) బుధవారం పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, స్థానికుల వివరాల ప్రకారం.. శ్రీరామ్ స్థానిక జగనన్న కాలనీలో నివాసం ఉంటున్నాడు. బుధవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో సమీప ప్రాంతానికి బహిర్భూమికి వెళ్లాడు. అదే సమయంలో ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తుండగా ఆయన సమీపంలో పిడుగు పడింది. దీంతో తల, ముఖానికి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న వీఆర్వో వాత్సల్యరాయ్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఘటనపై నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు.
శ్రీరామ్‌కు భార్య లక్ష్మి, ఇద్దరు కుమార్తెలు నాగమణి, లాస్య ఉన్నారు. నాగమణికి ఇప్పటికే వివాహం కాగా.. చిన్న కుమార్తె లాస్య వివాహం వచ్చే నెలలో జరగాల్సి ఉంది. పెళ్లి ఏర్పాట్లతో కళకళలాడాల్సిన ఇంట్లో పిడుగుపాటుతో విషాదం నెలకొంది. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న శ్రీరామ్ అకాల మరణంతో భార్య, కుమార్తెలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.


