సింథియా: ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ నౌకాదళాలతో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో భారత నౌకాదళ అధిపతి అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ బుధవారం నుంచి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో పర్యటిస్తున్నారు. జూన్‌లో జరిగిన రెండో భారత్–ఆస్ట్రేలియా రక్షణ మంత్రుల చర్చలు, జూలైలో జరిగిన మూడో భారత్–ఆస్ట్రేలియా వార్షిక శిఖరాగ్ర సమావేశం అనంతరం పెరుగుతున్న రక్షణ సహకారానికి కొనసాగింపుగా ఈ పర్యటన జరుగుతోంది. పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా నేవీ, రక్షణ శాఖ ఉన్నతాధికారులతో అడ్మిరల్ స్వామినాథన్ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. సముద్ర భద్రత, నావికా కార్య కలాపాలు, పరస్పర సమన్వయం, సమాచార మార్పిడి, శిక్షణ, వృత్తిపరమైన మార్పిడులను మరింత బలోపేతం చేసే అంశాలపై చర్చించనున్నారు. అనంతరం న్యూజిలాండ్ నేవీ, రక్షణ శాఖ ఉన్నతాధికారులతోనూ ఆయన సమావేశమై ద్వైపాక్షిక నావికా సహకారాన్ని విస్తరించే అంశాలపై చర్చలు జరపనున్నారు. ఈ పర్యటనతో సముద్ర భద్రత, ప్రాంతీయ సహకారంతో పాటు రక్షణ, భద్రతా రంగాల్లో ఇరుదేశాలతో భారత్ సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయని నేవీ వర్గాలు తెలిపాయి.


