పార్టీ కోసం కష్టపడిన వారికే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు గ్రామ, వార్డు, జిల్లా స్థాయి కమిటీలు చురుగ్గా పనిచేయాలి ‘వెన్నుపోటు పార్టీ–వెన్నుపోటు పాలన’ బుక్‌లెట్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లాలి సోషల్ మీడియా, లీగల్ సెల్ విభాగాలు బలోపేతం చేయాలి జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో బొత్స, కేకే రాజు పిలుపు
సాక్షి, విశాఖపట్నం: కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడాలని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఏకగ్రీవాలకు అవకాశం లేకుండా చూడాలన్నారు. పార్టీలో కష్టపడి పనిచేసే వారికే టికెట్లు లభిస్తాయన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆధ్వర్యంలో మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ముందుగా కేకే రాజు, గొల్ల బాబూరావు, కదిరి బాబూరావు, బొత్స ఝాన్సీలక్ష్మి, కుంబా రవిబాబు, నియోజకవర్గ సమన్వయకర్తలతో కలిసి వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం ‘వెన్నుపోటు పార్టీ – వెన్నుపోటు పాలన’ బుక్‌లెట్‌ను ఆవిష్కరించారు. పార్టీ గుర్తింపు కార్డులను నేతలకు అందజేశారు.
వెన్నుపోటు పార్టీ.. వెన్నుపోటు పాలన
టీడీపీ ఒక వెన్నుపోటు పార్టీ అని, జనాలను మోసం చేస్తూ వెన్నుపోటు పాలన సాగిస్తోందని బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనలో అరాచకాలు, దౌర్జన్యాలు, భూ దోపిడీలు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. డీఎస్సీలో అక్రమాలు జరిగాయని, స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు అమ్ముకున్నారని మండిపడ్డారు. టెట్ క్వాలిఫై అవ్వకపోయినా ఉద్యోగాలు కట్టబెట్టారని ధ్వజమెత్తారు. ఎవరైనా ప్రశ్నిస్తే కేసులు పెడతామంటున్నారని, దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలని సవాల్ విసిరారు. రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తున్నా ప్రభుత్వం మొద్దు నిద్దరపోతోందని దుయ్యబట్టారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం నుంచి నీళ్లు తెచ్చి.. పోలవరం నీళ్లు అంటూ చంద్రబాబు ఉత్తరాంధ్ర ప్రజలకు అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. పార్టీ మారిన మజ్జి శ్రీనివాసరావు తీరుపై బొత్స స్పందిస్తూ.. రాజకీయాల్లో మనిషికి స్వార్థం ఉంటుందని, మనుషులు వస్తుంటారు.. పోతుంటారు.. కానీ పార్టీ మాత్రం శాశ్వతమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో విశాఖ పార్లమెంట్ పరిశీలకుడు కదిరి బాబురావు, పీఏసీ సభ్యుడు తిప్పల నాగిరెడ్డి, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయకుమార్, చింతలపూడి వెంకట రామయ్య, శోభా హైమవతి, నియోజకవర్గ పరిశీలకులు పేడాడ రమణికుమారి, జహీర్ అహ్మద్, వీసం రామకృష్ణ, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సుంకర గిరిబాబు, పార్టీ పర్యవేక్షకులు గుడిమెట్ల రవిరెడ్డి, ముఖ్యనాయకులు కోలా గురువులు, కటుమూరి సతీష్, బాణాల శ్రీనివాసరావు, రొంగలి జగన్నాథం, ఐహెచ్ ఫారూఖీ, జాన్‌వెస్లీ, పోతిన హనుమంతురావు, పీలా వెంకటలక్ష్మి, తాడి జగన్నాథరెడ్డి, జీఎస్‌వీవీ కేఏఎన్ రాజు, కోరుకొండ వెంకటరత్న స్వాతి, పీవీఎస్‌వీ ప్రసాద్‌రాజు, పార్టీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, వార్డు అనుబంధ విభాగాల అధ్యక్షులు, కార్యనిర్వాహక అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు, మాజీ కార్పొరేటర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
హాజరైన పార్టీ శ్రేణులు


