సచివాలయాల వద్ద
వృద్ధులు, వితంతువుల పడిగాపులు
కఠిన నిబంధనలు, సర్వర్
మొరాయింపుతో అవస్థలు
మూడు రోజుల్లో జిల్లాలో
6,836 దరఖాస్తుల నమోదు
మహారాణిపేట: కొత్త పింఛన్ల దరఖాస్తుల ప్రక్రియ వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు చుక్కలు చూపిస్తోంది. సాంకేతిక సమస్యలు, నిబంధనల కొర్రీలతో దరఖాస్తుదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలోనే ప్రభుత్వం హడావుడిగా ఈ ప్రక్రియ చేపట్టిందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. పింఛన్ మంజూరుకు ఎలాంటి స్పష్టమైన గడువు లేకపోవడం, మంజూరు అధికారాలను ఎంపీడీవోల నుంచి తొలగించడం వంటి నిర్ణయాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మందకొడిగా ఆన్‌లైన్ ప్రక్రియ..
గత సోమవారం ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ తొలిరోజు నుంచి నెమ్మదిగా సాగుతోంది. మూడు రోజుల్లో విశాఖ నగరంతో పాటు నాలుగు మండలాల పరిధిలోని మొత్తం 607 సచివాలయాల్లో కలిపి 6,836 దరఖాస్తులు అందాయి. 7వ తేదీన 1,773, 8న 3,140, 9న 1,923 దరఖాస్తులు వచ్చాయి. అయితే సర్వర్ సమస్యలు, ఓటీపీలు సకాలంలో రాకపోవడంతో సచివాలయ సిబ్బందికి ఏం చేయాలో పాలుపోవడం లేదు.
షాకిస్తున్న విద్యుత్ నిబంధనలు
విద్యుత్ వినియోగానికి సంబంధించిన నిబంధనలు దరఖాస్తుదారులకు పెనుభారంగా మారాయి. 300 యూనిట్లకు పైగా విద్యుత్ వినియోగం ఉన్న వారి వివరాలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ కావడం లేదు. అలాగే దరఖాస్తుదారుడి పేరిట కనీసం విద్యుత్ మీటరు ఉండరాదనే నిబంధన కూడా ఇబ్బందికరంగా మారింది. నాయి బ్రాహ్మణులు, రజకులు, మత్స్యకారులు, డప్పు కళాకారులు దరఖాస్తు చేసుకునే సమయంలో గుర్తింపు కార్డులు అడుగుతుండటంతో ప్రక్రియ ముందుకు సాగడం లేదు.
సచివాలయాల్లో పట్టించుకునే నాథుడేడీ?
ఆన్‌లైన్ సమస్యలతో వృద్ధులు అల్లాడిపోతున్నారు. గంటల తరబడి సచివాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నా, కీలకమైన వెల్ఫేర్, డిజిటల్ అసిస్టెంట్లు అందుబాటులో ఉండటం లేదనే ఆరోపణలున్నాయి. అధికారుల స్పందన అంతంత మాత్రంగానే ఉండటంతో వృద్ధులు, వితంతువులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఈ సాంకేతిక అడ్డంకులను వెంటనే తొలగించి, తమ కష్టాలు తీర్చాలని కోరుతున్నారు.


