మద్దిలపాలెం: కొప్పరపు కవుల కళాపీఠం 24వ వార్షికోత్సవ వేడుకలు బుధవారం కళాభారతి ఆడిటోరియంలో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రవచనకారుడు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మకు ప్రతిష్టాత్మక ‘కొప్పరపు కవుల జాతీయ ప్రతిభా పురస్కారం–2026’ను ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.కృష్ణ మోహన్, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ దుర్గా ప్రసాద్, ఆచార్య విశ్వనాథ గోపాలకృష్ణశాస్త్రి, ఆచార్య తాడేపల్లి పతంజలిశాస్త్రి, అమెరికాకు చెందిన ప్రముఖ హృద్రోగ నిపుణుడు డాక్టర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా పురస్కారాన్ని అందజేశారు. కార్యక్రమానికి ఆచార్య బేతవోలు రామబ్రహ్మం అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.కృష్ణమోహన్ మాట్లాడుతూ భారతీయ వాజ్మయంలో విద్యార్థులను తీర్చి దిద్దుతున్న అభినవ వ్యాసుడు సామవేదం షణ్ముఖశర్మ అని ప్రశంసించారు. కొప్పరపు సోదరకవుల పద్యాలు తెలుగు పాఠ్యాంశాలుగా రావాలని తద్వారా తెలుగు భాషకు పూర్వ వైభవం తేవాలని ఆకాంక్షించారు. గౌరవ అతిథి ఏపీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ భారతీయ అవధాన ప్రక్రియను శిఖర స్థాయికి తీసుకెళ్లిన కొప్పరపు సోదరకవుల స్మారకంగా వారి పేరిట అవధాన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం ప్రజలందరి సంతకాలతో ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించాలని సూచించారు. అనంతరం ‘దైవ సంకల్పం’ అనే అంశంపై సుమారు గంటపాటు సామవేదం షణ్ముఖ శర్మ చేసిన ప్రవచనం అందరినీ ఆకట్టుకుంది.


