సీఎంకు వెయ్యి పోస్టు కార్డులు | - | Sakshi
Sakshi News home page

సీఎంకు వెయ్యి పోస్టు కార్డులు

Sep 10 2026 3:32 AM | Updated on Sep 10 2026 3:32 AM

డిమాండ్ల పరిష్కారానికి

కాంట్రాక్ట్‌ వైద్య ఉద్యోగుల ఉద్యమం

మహారాణిపేట: తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కాంట్రాక్ట్‌ వైద్య ఉద్యోగులు నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరవుతూ, నిరసన తెలియజేస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో పోస్ట్‌ కార్డు ఉద్యమం చేపట్టినట్లు జిల్లా జేఏసీ కన్వీనర్‌ కిషోర్‌రావు తెలిపారు. కేజీహెచ్‌ క్లాక్‌టవర్‌ నుంచి బుధవారం పోస్ట్‌కార్డు ఉద్యమం నిర్వహించారు. రాష్ట్ర మెడికల్‌ అండ్‌ హెల్త్‌ జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు, విశాఖపట్నం జిల్లా జేఏసీ కమిటీ ఆధ్వర్యంలో కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించిన అనంతరం మానవహారంగా ఏర్పడ్డారు. కిషోర్‌రావు మాట్లాడుతూ తమ డిమాండ్లను మానవతా దృక్పథంతో పరిశీలించాలని కోరుతూ ముఖ్యమంత్రికి వెయ్యి మంది ఉద్యోగులు పోస్టుకార్డులు పంపినట్లు తెలిపారు. జేఏసీ చైర్మన్‌ ఎస్‌.కె.ఆశ మాట్లాడుతూ ఏళ్ల తరబడి వైద్య ఆరోగ్య శాఖలో సేవలందిస్తున్న కాంట్రాక్ట్‌ ఉద్యోగులందరినీ వెంటనే రెగ్యులర్‌ చేయాలన్నారు. రెగ్యులరైజేషన్‌ ప్రక్రియ పూర్తయ్యే వరకు 100శాతం గ్రాస్‌ వేతనం చెల్లించాలని, విధి నిర్వహణలో మరణించిన వారి కుటుంబానికి రూ.50లక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటు ఒకరికి ఉద్యోగం కల్పించాలని కోరారు. జేఏసీ నాయకుడు శివప్రసాద్‌, జేఏసీ కో–చైర్మన్‌ పైడిరాజు మాట్లాడుతూ ఈపీఎఫ్‌, హెల్త్‌కార్డు తదితర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖకు చెందిన అన్ని విభాగాల కాంట్రాక్ట్‌ ఉద్యోగులు సంఘం నాయకులు, జేఏసీ నాయకులు రాజశేఖర్‌,పద్మావతి, దుర్గాభవాని, కేకే రాజు, కె.నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement