విశాఖ విద్య: ఉల్లి ధరల మంటకు సామాన్యుడి కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. మొన్నటి వరకు కేజీ రూ.30 పలికిన ఉల్లి.. ఇప్పుడు బయట మార్కెట్‌లో రూ.70 దాటింది. ధర రోజుకో మెట్టు ఎక్కుతుండటంతో జనం రైతుబజార్ల వైపు పరుగులు తీస్తున్నారు. అక్కడ కాస్త తక్కువ ధరకు దొరుకుతుందన్న ఆశతో తెల్లవారుజామునే క్యూలు కడుతున్నారు.
కానీ రైతుబజార్లకు సరిపడా సరకు కేటాయించని పరిస్థితి. ఒకవేళ ఉల్లి దొరికినా.. నాణ్యతపై కొనుగోలుదారులు పెదవి విరుస్తున్నారు. ధరల నియంత్రణలో ప్రభుత్వ యంత్రాంగం ప్రేక్షకపాత్ర పోషిస్తుండటంతో.. వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మార్కెట్‌లో మంట..
రైతుబజారులో స్టాక్ కొరత
ఉల్లి ధరలు ఒక్కసారిగా పెరగడంతో కుటుంబ బడ్జెట్లపై అదనపు భారం పడుతోంది. బహిరంగ మార్కెట్‌లో కేజీ రూ.70కుపైగా పలుకుతుండగా.. ధరలు రోజుకో విధంగా మారుతున్నాయి. దీంతో తక్కువ ధరకు లభించే రైతుబజార్లే సామాన్యులకు ప్రత్యామ్నాయంగా మారాయి. సీతమ్మధార రైతుబజారులో కొనుగోలుదారుల రద్దీని దృష్టిలో పెట్టుకుని నాలుగు కౌంటర్ల ద్వారా విక్రయాలు చేపడుతున్నారు. కేజీ రూ.53 చొప్పున విక్రయిస్తున్నా.. సరకు పరిమితంగా ఉండటంతో వినియోగదారుల అవసరాలు పూర్తిగా తీరడం లేదు. రోజుకు 100 బస్తాల సరకు మాత్రమే వస్తుండగా.. కనీసం 200 బస్తాలు కేటాయిస్తేనే డిమాండ్‌కు అనుగుణంగా విక్రయాలు సాగుతాయని రైతుబజారు వర్గాలు చెబుతున్నాయి.
బియ్యం కూడా భారమే...
ఉల్లితో పాటు బియ్యం విక్రయాలపైనా రైతుబజార్లలో డిమాండ్ పెరిగింది. బయట మార్కెట్‌లో ధరలు గణనీయంగా పెరగడంతో సగటు వినియోగదారులు ఆందోళనకు గురవుతున్నారు. సీతమ్మధార రైతుబజారులో సబ్సిడీ కింద కేజీ బియ్యాన్ని రూ.52కు విక్రయిస్తుండగా.. సూపర్‌బజారులో అదే బియ్యం కేజీ రూ.63కు విక్రయిస్తున్నారు. అయితే రైతుబజారుకు కూడా సరిపడా స్టాక్ కేటాయించకపోవడంతో కొనుగోలుదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. భవిష్యత్తులో బియ్యం ధరలు మరింత పెరుగుతాయన్న ప్రచారం కూడా ప్రజల్లో ఆందోళన పెంచుతోంది. దీంతో కొందరు ముందుగానే బియ్యం కొనుగోలు చేసి ఇళ్లలో నిల్వ చేసుకుంటున్నారు. ఫలితంగా రైతుబజార్లలో అందుబాటులో ఉన్న బియ్యానికి డిమాండ్ మరింత పెరుగుతోంది.
బహిరంగ మార్కెట్‌లో కేజీ రూ.70 పైనే రైతు బజార్లలో సరిపడా స్టాక్ లేక అవస్థలు బియ్యానికీ పెరిగిన గిరాకీ!
సరఫరా పెంచాలి..
మార్కెట్‌పై నిఘా పెట్టాలి
నిత్యావసరాల ధరలు పెరుగుతున్న సమయంలో ప్రభుత్వం కేవలం విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయడంతో సరిపెట్టకుండా.. వాటికి సరిపడా సరకు అందుబాటులో ఉంచాలని ప్రజలు కోరుతున్నారు. ఒకవైపు బయట మార్కెట్‌లో ధరలు పెరుగుతుండగా.. మరోవైపు తక్కువ ధరకు విక్రయించే రైతుబజార్లలో సరిపడా స్టాక్ లేకపోతే ప్రయోజనమేంటని ప్రశ్నిస్తున్నారు. వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచుతున్నారన్న ఆరోపణలపై అధికారులు తనిఖీలు చేపట్టడంతో పాటు.. మార్కెట్‌లో ధరల కదలికను నిరంతరం పర్యవేక్షించాలని కోరుతున్నారు. ఉల్లి, బియ్యం వంటి నిత్యావసరాల సరఫరా పెంచి, ధరల నియంత్రణకు తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
ఉల్లి కోసం ఉదయం నుంచే క్యూ
బయట మార్కెట్‌తో పోలిస్తే రైతుబజారులో ధర తక్కువగా ఉండటంతో ప్రజలు అక్కడే కొనుగోలు చేసేందుకు పోటీపడుతున్నారు. అయితే పరిమిత స్టాక్ కారణంగా క్యూలు పెరుగుతున్నాయి. కొందరికి సరకు దొరికినా.. మరికొందరు ఖాళీ చేతులతో వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ధరలు పెరిగినప్పుడు మార్కెట్‌ను నియంత్రించాల్సిన పౌరసరఫరాల శాఖ సరఫరా పెంచడంలో విఫలమవుతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డిమాండ్‌కు తగ్గట్టుగా సరకు అందుబాటులోకి వస్తేనే ధరలపై ఒత్తిడి తగ్గే అవకాశం ఉందని వినియోగదారులు అంటున్నారు.
ఉల్లిపాయను కోస్తే కన్నీళ్లు రావడం సహజం.
కానీ, కొనకముందే దాని ధర చూసి కళ్లల్లో నీళ్లు
తిరగడం నగరంలో నిత్యకృత్యంగా మారింది. మార్కెట్ మాయాజాలం పేద, మధ్యతరగతి జేబులకు చిల్లులు పెడుతుంటే.. చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం ఉల్లి కొరతను కృత్రిమంగా సృష్టిస్తున్న వ్యాపారులకు పరోక్షంగా కొమ్ముకాస్తోంది. ఉపశమనం కల్పించాల్సిన రైతుబజార్లలో నాణ్యత లేని సరకు, అరకొర సరఫరాతో వినియోగదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి.


