మహారాణిపేట: ఫిషింగ్ హార్బర్‌లోని చేపల వ్యాపారులపై లీగల్ మెట్రాలజీ అధికారులు మంగళవారం మెరుపు దాడులు నిర్వహించారు. లీగల్ మెట్రాలజీ డిప్యూటీ కంట్రోలర్ కేటీ రవికుమార్ ఆధ్వర్యంలో పరిధిలోని ఇన్‌స్పెక్టర్లు తనిఖీలు చేపట్టారు. ముద్రలు, సీలు లేని కాటాలను కొంతమంది వ్యాపారులు వినియోగిస్తున్నట్లు పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదులు అందాయి. తూనికలు, కొలతల శాఖ నిబంధనల్లోని లోపాలను ఆసరాగా చేసుకుని వినియోగదారులను మోసగిస్తున్నట్లు ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ కంట్రోలర్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో నిబంధనలకు విరుద్ధంగా కాటాలు వినియోగిస్తున్న వారిపై మొత్తం 19 కేసులు నమోదు చేశారు. కొంతమంది వ్యాపారులు కాటాలను దాచిపెట్టినట్లు అధికారులు గుర్తించారు. ఈ సందర్భంగా డిప్యూటీ కంట్రోలర్ రవికుమార్ మాట్లాడుతూ అక్రమాలను అరికట్టేందుకు ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. వ్యాపారులు వినియోగించే కాటాలకు తప్పనిసరిగా ప్రభుత్వ సీలు, ముద్రలు ఉండాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దాడుల్లో సిటీ ఇన్‌స్పెక్టర్ దామోదర నాయుడు, గాజువాక ఇన్‌స్పెక్టర్ రాజారమేష్, పాడేరు ఇన్‌స్పెక్టర్ అనూరాధ, అనకాపల్లి ఇన్‌స్పెక్టర్ పద్మావతి, అనకాపల్లి సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ వెంకటరావు, టెక్నికల్ అసిస్టెంట్ ఇస్మాయిల్ పాల్గొన్నారు.


