డాబాగార్డెన్స్: అనకాపల్లి జిల్లా సిరసిపల్లి చింతామణి గణపతి దత్త క్షేత్రంలో 50 వేల మొక్కలతో 18 అడుగుల ఎత్తైన సస్య గణపతిని ఏర్పాటు చేయనున్నట్లు దేవీ శ్రీదేవి ఎంటర్‌ప్రైజెస్ నిర్వాహకుడు దేవత హేమ సుధాకర్ తెలిపారు. వీజేఎఫ్ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సహజ జలపాతాలు, పక్షుల కిలకిలరావాలు, చేపల కొలను, పచ్చని ప్రకృతి వాతావరణంతో ఈ సస్య గణపతి భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందించనుందని తెలిపారు. జీరో ప్లాస్టిక్ విధానంలో, ఎలాంటి రసాయన రంగులు లేకుండా సహజ సిద్ధమైన మొక్కలతో ఏడాది పాటు శ్రమించి దీనిని రూపొందించినట్లు చెప్పారు. ఈ నెల 14 నుంచి అక్టోబర్ 4 వరకు ప్రతిరోజూ ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు దర్శనానికి అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. సస్య గణపతిని ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో విజయ్‌కుమార్ నాయక్, ఎ. కిరణ్‌కుమార్, ఆంజనేయరాజు, ఏ. రాజేశ్వరి పాల్గొన్నారు.


