సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించాలి | - | Sakshi
Sakshi News home page

సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించాలి

Sep 5 2026 7:19 AM | Updated on Sep 5 2026 7:19 AM

విశాఖ విద్య: సాంకేతికతను సమర్థవంతంగా, సక్రమంగా వినియోగించడం ఎంతో ముఖ్యమని ఐఐటీ తిరుపతి డైరెక్టర్‌ ఆచార్య కె.ఎన్‌ సత్యనారాయణ అన్నారు. ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మూడు రోజుల అంతర్జాతీయ సదస్సు ‘క్వాంటం ఎన్‌హేన్స్‌డ్‌ సస్టైనబుల్‌ టెక్నాలజీ ఫర్‌ ఏఐ సిస్టమ్స్‌ (క్వెస్ట్‌–ఏఐ)’లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సాంకేతికతను సరైన రీతిలో వినియోగించుకునేందుకు ముందస్తు అవగాహన అవసరమన్నారు. భవిష్యత్‌ సాంకేతిక విప్లవం ఒకే సాంకేతికతపై ఆధారపడకుండా వివిధ సాంకేతికతల సమ్మేళనంగా ఉంటుందని పేర్కొన్నారు. క్వాంటం కంప్యూటింగ్‌ క్లాసికల్‌ కంప్యూటర్లకు ప్రత్యామ్నాయం కాదని, భవిష్యత్తులో రెండూ కలిసి పనిచేసే హైబ్రిడ్‌ విధానం ఉంటుందని తెలిపారు. క్వాంటమ్‌ టెక్నాలజీ, ఏఐ రంగాల్లో పరిశోధనలు సిద్ధాంతాలకే పరిమితం కాకుండా సమాజానికి ఉపయోగపడే పరిష్కారాలుగా మారాలని ఏయూ వీసీ రాజశేఖర్‌ అన్నారు. ఫెడరేషన్‌ యూనివర్సిటీ (ఆస్ట్రేలియా) ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ లెక్చరర్‌ నబిల్‌ మహమ్మద్‌ మాట్లాడుతూ ఏఐ, సస్టైనబుల్‌ టెక్నాలజీ, ఇంధన రంగాల్లో సవాళ్లను అధిగమించేందుకు విశ్వవిద్యాలయాలు, పరిశ్రమలు, పరిశోధనా సంస్థలు కలిసి పనిచేయాలని అన్నారు. జపాన్‌లోని ఒసాకా విశ్వవిద్యాలయం ఆచార్యులు డాక్టర్‌ మార్వాన్‌ ధారిం భారత్‌, జపాన్‌ల మధ్య విద్యా, పరిశోధనా సహకారం మరింత పెరగాలని ఆకాంక్షించారు.బాండ్‌ యూనివర్సిటీ (ఆస్ట్రేలియా) అసోసియేట్‌ ప్రొఫెసర్‌–ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ గ్రెగొరీ స్కుల్మోస్కీ మాట్లాడుతూ క్వాంటమ్‌ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ కలయిక భవిష్యత్తులో అనేక రంగాలపై ప్రభావం చూపుతుందని తెలిపారు. ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య కె. వెంకట సుబ్బయ్య, సీఎస్‌ఈ విభాగాధిపతి, డీన్‌ ఆచార్య వి. వల్లి కుమారి మాట్లాడుతూ ఏయూలో తొలిసారిగా క్లస్టర్‌ విభాగాల ఆధ్వర్యంలో అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు. మూడు రోజుల సదస్సులో సుమారు 60 పరిశోధనా పత్రాలను ఎంపిక చేయగా, 300 మందికిపైగా ప్రతినిధులు పాల్గొంటున్నారని వెల్లడించారు.కార్యక్రమంలో అవుట్‌రీచ్‌ విభాగం డీన్‌ ఆచార్య కె. రమా సుధ, విభాగాధిపతులు ఆచార్య టి.ఆర్‌. జ్యోత్స్న, డి. లలిత భాస్కరి, పి.వి. శ్రీదేవి, పి. స్వప్న, కె. వెంకట రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement