పెదగంట్యాడ: ఉక్కు నిర్వాసితులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయం చేయాలని నిర్వాసిత నాయకులు డిమాండ్ చేశారు. ఉక్కు నిర్వాసితుల ఐక్య సంఘం, నిర్వాసితుల కాంట్రాక్ట్ యూనియన్ సంయుక్తంగా పెదగంట్యాడలోని నెల్లిముక్కు సామాజిక భవనంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్ నిర్మాణం కోసం సర్వం కోల్పోయి ఆర్ కార్డు కలిగిన నిర్వాసితులకు వన్‌టైమ్ సెటిల్‌మెంట్ చేయాలన్నారు. మిగులు భూమిలో ఎకరం భూమి, సెటిల్‌మెంట్ చేసేవరకూ ప్రతి నెల జీవన భృతి కింద రూ.25 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
10న మహాధర్నా
తమ డిమాండ్ల పరిష్కారం కోరుతూ ఈ నెల 10న ఉదయం నుంచి సాయంత్రం వరకు స్టీల్‌ప్లాంట్ బీసీ గేట్ వద్ద 5 వేల మందితో మహాధర్నా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ మహాధర్నాలో ఉక్కు నిర్వాసితులు కుటుంబాలతో వచ్చి జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు పితాని భాస్కరరావు, ఉమ్మడి అప్పారావు, గల్లా రామకృష్ణ, శీర సంజీవ్, బొంతు అప్పారావు, అంగ దేముడు, పేర్ల జగన్, నెల్లి అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.


