డాబాగార్డెన్స్: సుప్రీంకోర్టు,హైకోర్టు తీర్పులను అనుసరించి పదోన్నతుల్లో ఓసీలకు రిజర్వేషన్లు కల్పించాలని విద్యుత్ ఓసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం నగరంలోని గ్రీన్‌పార్క్ హోటల్ సమీపంలోని విద్యుత్ విశ్రాంతి ఉద్యోగుల సంక్షేమ సంఘం హాల్లో విద్యుత్ ఓసీ జేఏసీ ఉద్యోగుల ఉమ్మడి విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల కార్యవర్గ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డీవీ రంగారావు, ప్రధాన కార్యదర్శి కోట శ్రీనివాసరావు, ఈపీడీసీఎల్ ప్రెసిడెంట్ ఎ. అప్పలరాజు, ప్రధాన కార్యదర్శి తురగా రామకృష్ణ, రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ డి. పండుదొర, అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ డి. వెంకట్‌రెడ్డి, కేటీ భాస్కర్, వైజాగ్ జిల్లా అధ్యక్షుడు పి. ఆనందబాబు తదితరులు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఓసీలకు పదోన్నతుల రిజర్వేషన్ల విషయంలో జరుగుతున్న అన్యాయంపై చర్చించారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్లను సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులకు అనుగుణంగా అమలు చేస్తూ పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న మెరిట్ సీనియార్టీ, జెన్యూన్ సమస్యను 2009 నుంచి అమలు చేసేందుకు సహకరించిన ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.అనంతరం ఉమ్మడి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.


