మహారాణిపేట: నగరంలోని రెండు రేషన్ షాపులపై పౌరసరఫరాల శాఖ అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు. సర్కిల్–2 పరిధిలోని అక్కయ్యపాలెం రేషన్ డిపో, ఇసుకతోట ప్రాంతంలోని రేషన్ షాపులపై పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదులు రావడంతో అధికారులు సోదాలు చేపట్టారు. డీఎస్‌వో వి. భాస్కరరావు ఆధ్వర్యంలో చెకింగ్ ఇన్‌స్పెక్టర్లు తనిఖీలు నిర్వహించారు. అక్కయ్యపాలెం రేషన్ డిపోలో తనిఖీల్లో స్టాక్ కంటే అదనంగా 300 కిలోల బియ్యం ఉన్నట్లు గుర్తించారు. ఇసుకతోటలోని 564వ రేషన్ షాపులో తనిఖీ చేయగా, 1,800 కిలోల బియ్యం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఈ రెండు షాపులపై 6(ఏ) కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్‌వో తెలిపారు. విచారణ పూర్తయ్యే వరకు సమీపంలోని మరో రేషన్ షాపుకు సరుకుల పంపిణీ బాధ్యతలను అటాచ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.


