మహారాణిపేట: మహారాణిపేటలోని సెయింట్ అంథోనీ ఉన్నత పాఠశాల ఆవరణలో ఉన్న 200 ఏళ్ల మర్రి మహావృక్షం తొలగింపు ప్రక్రియను రెవెన్యూ అధికారులు గురువారం అడ్డుకున్నారు. చారిత్రక ప్రాధాన్యం కలిగిన ఈ చెట్టును నిబంధనలకు విరుద్ధంగా తొలగిస్తున్నారనే సమాచారాన్ని కొందరు విశాఖ ఆర్డీవో దిలీప్ చక్రవర్తి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన ఆదేశాల మేరకు మహారాణిపేట తహశీల్దార్ లచ్చాపాత్రుడు పాఠశాల ప్రాంగణానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. వెంటనే చెట్టు తొలగింపు పనులను నిలిపివేయాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించి చెట్టును తొలగిస్తే చర్యలు తప్పవని పాఠశాల యాజమాన్యానికి సూచించారు. పచ్చదనంతో నిండిన పాఠశాల ఆవరణలోని ఈ మహావృక్షానికి ఎంతో చారిత్రక ప్రాధాన్యం ఉందని స్థానికులు పేర్కొన్నారు. ఈ చెట్టుపై వివిధ రకాల వలస పక్షులు సేదతీరుతాయని, నగర వారసత్వ సంపదగా దీనిని పరిరక్షించాలని కోరుతున్నారు.


