మహారాణిపేట: కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ ఐజీ గోపీనాథ్ జెట్టి బుధవారం విశాఖలోని ఇండియన్ కోస్ట్ గార్డ్, ఇండియన్ నేవీ కంట్రోల్ రూమ్‌లను సందర్శించారు. ఓడల రేవు ఎఫ్‌ఎల్‌సీ నుంచి బయలుదేరి గల్లంతైన ఫిషింగ్ బోట్, దాని సిబ్బందికి సంబంధించి కొనసాగుతున్న సెర్చ్ అండ్ రెస్క్యూ(ఎస్‌ఏఆర్) ఆపరేషన్ స్థితిని అధికారులతో ఆయన సమీక్షించారు. ఫిషింగ్ బోటు ఆచూకీ, సిబ్బంది కోసం తీర ప్రాంతం నుంచి సముద్రంలోకి 100 నాటికల్ మైళ్ల వరకు, ఓడ రేవు నుంచి పశ్చిమ బెంగాల్ వైపు గాలింపు చర్యలు ముమ్మరంగా చేపట్టాలని ఐజీ ఆదేశించారు. ఇప్పటికే ఐదు కోస్ట్ గార్డ్ నౌకలను మోహరించి వాటి ద్వారా గాలింపు చర్యలు చేపట్టారు. తాజాగా ఇండియన్ కోస్ట్ గార్డ్‌కు చెందిన రెండు డోర్నియర్ విమానాలు కూడా ఈ ఆపరేషన్‌లో పాల్గొంటున్నాయి. ఒడిశా, వెస్ట్ బెంగాల్ మైరెన్ పోలీసులను సంప్రదించి వారి ప్రాంతాల్లో కూడా బోటు, సిబ్బంది కోసం గాలింపు చర్యలు చేపట్టాలని ఐజీ కోరారు. పలువురు కోస్టల్ సెక్యూరిటీ అధికారులు, మైరెన్ పోలీసులు పాల్గొన్నారు.


