జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్
ఏయూ క్యాంపస్: మారుతున్న కాలానికి అనుగుణంగా డిజిటల్ యుగం వచ్చినా.. మన జ్ఞాపకాలను శాశ్వతంగా బంధించేది ఫొటో మాత్రమేనని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ అన్నారు. వైజాగ్ ఫొటో జర్నలిస్టుల అసోసియేషన్ ఆధ్వర్యంలో బీచ్‌రోడ్డులోని విశాఖ మ్యూజియంలో రెండు రోజులపాటు నిర్వహిస్తున్న ఫొటో ఎగ్జిబిషన్‌ను మంగళవారం ఆయన ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం గత ఏడాది కాలంలో ఫొటో జర్నలిస్టులు తీసిన ఛాయాచిత్రాలను కమిషనర్ పరిశీలించారు. ఫొటోగ్రఫీ వాస్తవ పరిస్థితులను ప్రజలకు చూపించే శక్తివంతమైన మాధ్యమమని పేర్కొన్నారు. ఈ ప్రదర్శన భవిష్యత్తులో మరింత విస్తరించాలని ఆకాంక్షించారు. జీవీఎంసీ డిస్‌ప్లే బోర్డుల ద్వారా మరో వారం, పది రోజులపాటు చిత్రాలను ప్రదర్శించేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అసోసియేషన్ అధ్యక్షుడు వై.రామకృష్ణ మాట్లాడుతూ.. నగరంలో జరిగే ముఖ్య కార్యక్రమాల ఛాయాచిత్రాలను విశాఖ మ్యూజియంలో ప్రదర్శిస్తే పర్యాటకులు, విద్యార్థులకు నగర అభివృద్ధి, చారిత్రక అంశాలపై అవగాహన కలుగుతుందన్నారు. అనంతరం కమిషనర్ కేతన్ గార్గ్‌ను సన్మానించారు. ఆంధ్రప్రదేశ్ ప్రెస్ ఫొటోగ్రఫీ పోటీల్లో జాతీయ అవార్డు పొందిన కె.ఆర్.దీపక్, కన్సొలేషన్ అవార్డులు అందుకున్న వై.రామకృష్ణ, పి.ఎల్.మోహన్‌రావు, ఆలపాటి శరత్‌కుమార్, పిల్లా నగేష్, కె.మురళీకృష్ణ, టి.గణేష్‌కుమార్‌లను కమిషనర్ సత్కరించి జ్ఞాపికలు అందించారు. కార్యక్రమంలో జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, నగరవాసులు, విద్యార్థులు పాల్గొన్నారు.


