ఉగ్ర కదలికలపై మెరుపు దాడి
హెచ్‌పీసీఎల్, ఈఐసీఎల్ కేంద్రాల్లో కమాండోల విన్యాసాలు
ఉత్కంఠభరితంగా
భద్రతా బలగాల మాక్ డ్రిల్
అల్లిపురం: ఒక్కసారిగా ఎమర్జెన్సీ సైరన్ మోగింది. కీలక చమురు నిల్వ కేంద్రాలపై ఉగ్రదాడి జరిగినట్లు సమాచారం అందింది. నిమిషాల వ్యవధిలోనే రంగంలోకి దిగిన ప్రత్యేక కమాండోలు శత్రు మూకలను చుట్టుముట్టారు. ఉగ్రవాద ముప్పును సమర్థంగా తిప్పికొట్టడంలో భద్రతా బలగాల సంసిద్ధతను చాటుతూ ఆక్టోపస్ దళం నిర్వహించిన మాక్ డ్రిల్ తీవ్ర ఉత్కంఠ రేపింది. బుధవారం హెచ్‌పీసీఎల్, ఈఐసీఎల్ ప్రాంగణాల్లో నిర్వహించిన ఈ విన్యాసం బలగాల అప్రమత్తతకు అద్దం పట్టింది.
నిమిషాల వ్యవధిలో మెరుపు దాడి
డీఎస్పీలు జి.విశ్వనాథ్, పి.జగ్గునాయుడు, బి.కృష్ణల పర్యవేక్షణలో సుమారు 100 మంది ఆక్టోపస్ సిబ్బంది, 10 మంది రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. అత్యవసర అలర్ట్ అందిన వెంటనే ప్రత్యేక కమాండోలు వ్యూహాత్మకంగా ఆయా ప్రాంగణాల్లోకి ప్రవేశించి, ప్రతి అంగుళాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
సమన్వయంతో కదిలిన విభాగాలు
ఆక్టోపస్ దళంతో పాటు సీఐఎస్‌ఎఫ్, జిల్లా సివిల్ పోలీస్, ఏఆర్ బలగాలు సమన్వయంతో రంగంలోకి దిగాయి. పరిస్థితి తీవ్రతను బట్టి క్షతగాత్రులను వేగంగా తరలించేందుకు వైద్య బృందాలు, ప్రమాద నివారణకు అగ్నిమాపక శకటాలు, పరిపాలనాపరమైన చర్యల కోసం రెవెన్యూ అధికారులు అత్యంత వేగంగా స్పందించారు.
క్షేత్రస్థాయి సామర్థ్యాల పరిశీలన
అత్యవసర సమాచారం అందిన వెంటనే బలగాలు ఎంత వేగంగా స్పందిస్తున్నాయనే రెస్పాన్స్ టైమ్‌ను, వివిధ విభాగాల మధ్య సమాచార వ్యవస్థను, సంక్షోభ సమయంలో వనరుల వినియోగాన్ని అధికారులు నిశితంగా పరిశీలించారు. క్షేత్రస్థాయిలో కార్యాచరణ లోపాలు లేకుండా చూసుకునేందుకు ఈ విన్యాసం దోహదపడింది.
రక్షణ కవచం.. ‘ఆక్టోపస్’
దేశ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమైన చమురు శుద్ధి, ఇంధన నిల్వ కేంద్రాల భద్రతను కాపాడటమే ఈ ఆపరేషన్ ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు. ఇలాంటి మాక్ డ్రిల్స్ కేవలం సాధారణ ప్రదర్శనలు మాత్రమే కావని, సంక్షోభ సమయాల్లో ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించేందుకు నిర్వహించే ‘రియల్ టైమ్ రెడీనెస్ టెస్ట్’ అని స్పష్టం చేశారు. ప్రజా భద్రత, కీలక మౌలిక సదుపాయాల పరిరక్షణలో బలగాలు నిరంతరం అప్రమత్తంగా ఉంటాయని వెల్లడించారు.


