ప్రతికూలతల్ని దాటి.. డీఎల్‌ సాధించి! | - | Sakshi
Sakshi News home page

ప్రతికూలతల్ని దాటి.. డీఎల్‌ సాధించి!

Aug 20 2026 12:05 AM | Updated on Aug 20 2026 12:05 AM

● ఏపీపీఎస్సీ డిగ్రీ లెక్చరర్ల ఫలితాల్లో ప్రత్యూష ప్రతిభ ● మ్యాథ్స్‌ డీఎల్‌గా ఓపెన్‌ కేటగిరీలో ఎంపిక

విశాఖ విద్య: ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదురైనా అనుకున్న లక్ష్యం కోసం నిరంతరం శ్రమించి విజయం సాధించారు నగరానికి చెందిన ప్రత్యూష. మనో సంకల్పం ముందు ఎంత పెద్ద అవరోధాలైనా పటాపంచలవుతాయని నిరూపించారు. కుటుంబ పేదరికానికి తోడు ఉపాధినిచ్చే దుకాణం అగ్నికి ఆహుతైనా.. ఆమె తల్లిదండ్రులు వెనుకడుగు వేయలేదు. తమ కుమార్తెకు ఉన్నత విద్య అందించాలన్న వారి పట్టుదల ప్రత్యూషలో బలమైన సంకల్పాన్ని నాటింది. ఆ స్ఫూర్తితో ఆమె ఏపీపీఎస్సీ డిగ్రీ కాలేజీ లెక్చరర్‌(డీఎల్‌) పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఓపెన్‌ కేటగిరీలో మ్యాథ్స్‌ లెక్చరర్‌గా ఎంపికయ్యారు. గృహిణిగా బాధ్యతలు నిర్వహిస్తూనే ఈ ఘనత సాధించడం విశేషం.

తల్లిదండ్రుల మద్దతు

నగరానికి చెందిన ప్రత్యూష నారాయణశెట్టి తల్లిదండ్రులు గౌరీశంకరరావు, రజనిలు స్క్రాప్‌ దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగించేవారు. 2005లో వారి దుకాణం అగ్నికి ఆహుతైంది. దీంతో మళ్లీ మొదటి నుంచి వ్యాపారాన్ని ప్రారంభించాల్సి వచ్చింది. అయినా వారు నిరాశ చెందకుండా తమ కుమార్తె చదువుపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచారని ప్రత్యూష తెలిపారు.

చదువుల్లో మేటి : కొమ్మాదిలోని జవహర్‌ నవోదయ విద్యాలయంలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం వరకు విద్యాభ్యాసం చేసిన ప్రత్యూష.. సీయూసెట్‌లో ఆల్‌ ఇండియా 13వ ర్యాంకు సాధించారు. అనంతరం తమిళనాడు సెంట్రల్‌ యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్‌ ఎంఎస్సీ పూర్తి చేశారు. 2016లో జరిగిన సీఎస్‌ఐఆర్‌ ఇంటర్న్‌షిప్‌ ఇంటర్వ్యూకు దేశవ్యాప్తంగా ఎంపికై న ఎనిమిది మందిలో ఆమె ఒకరు. అదే ఏడాది ఐఐటీ మద్రాస్‌లో నిర్వహించిన మ్యాథమెటికల్‌ ట్రైనింగ్‌ సెర్చ్‌ ప్రోగ్రామ్‌కు దేశవ్యాప్తంగా ఎంపికై న 40 మందిలోనూ చోటు దక్కించుకున్నారు.

చంటి బిడ్డను చంకనేసుకుని..

పలు ప్రైవేట్‌ కళాశాలల్లో లెక్చరర్‌గా పనిచేసిన ప్రత్యూషకు 2021లో గౌరీ ప్రసాద్‌తో వివాహమైంది. తర్వాత బిడ్డకు జన్మనిచ్చిన ఆమె.. కుటుంబ బాధ్యతల మధ్య తన లక్ష్యాన్ని మాత్రం మర్చిపోలేదు. ఇదే సమయంలో నోటిఫికేషన్‌ వెలువడటంతో ఏడాది వయసున్న బిడ్డ ఆలనాపాలనా చూసుకుంటూనే పోటీ పరీక్షకు సిద్ధమయ్యారు.

బోధనపై ఇష్టంతో..

చాలా మంది ఐటీ రంగంలోకి వెళ్లాలని సూచించినప్పటికీ.. తనకు చిన్నప్పటి నుంచే బోధన అంటే ఇష్టమని ప్రత్యూష తెలిపారు. లెక్చరర్‌గా పనిచేయాలన్నదే తన ఆకాంక్ష అన్నారు. అందుకే తనకు ఇష్టమైన బోధనా రంగాన్నే ఎంచుకుని, విజయం సాధించినట్లు తెలిపారు.

గత ప్రభుత్వం హయాంలో నోటిఫికేషన్‌

2023లో అప్పటి ప్రభుత్వం ఏపీపీఎస్సీ డీఎల్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 2025లో పరీక్ష నిర్వహించగా.. ఈ ఏడాది ఆగస్టు 14న తుది ఫలితాల జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. అందులో ప్రత్యూష డిగ్రీ కాలేజీ మ్యాథ్స్‌ లెక్చరర్‌గా ఎంపికయ్యారు. త్వరలో జోన్‌–4 పరిధిలోని ఏదో ఒక ప్రాంతంలో విధుల్లో చేరనున్నారు.

వారి సహకారంతోనే..

తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడంలో తల్లిదండ్రులు, భర్త, అత్త మంగమ్మ, మామయ్య గోవిందరావు అందించిన సహకారం మర్చిపోలేనిదని ప్రత్యూష తెలిపారు. ప్రతికూల పరిస్థితులు ఎదురైనా పట్టుదలతో ముందుకు సాగితే లక్ష్యాన్ని చేరుకోవచ్చని తన విజయంతో ఆమె నిరూపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement