మహారాణిపేట: శాసన మండలి సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు సభా సంప్రదాయాలకు విరుద్ధమని వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆల్ఫా కృష్ణ ఆక్షేపించారు. మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణను ఉద్దేశించి ‘దద్దమ్మ’అంటూ చేసిన వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మద్దిలపాలెంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మీడియాతో బుధవారం ఆయన మాట్లాడారు. ప్రజాప్రతినిధులు వ్యక్తిగత దూషణలకు దూరంగా ఉండి సభల్లో హుందాగా వ్యవహరించాలని సూచించారు. ప్రజా సమస్యలు, ప్రభుత్వ హామీలు, అభివృద్ధి, డీఎస్సీ అంశాలపై నిర్మాణాత్మక చర్చకు వైఎస్సార్‌సీపీ సిద్ధంగా ఉందన్నారు. ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేని టీడీపీ నేతలు.. అధికారంలో ఉన్నామనే ధీమాతో ప్రతిపక్ష నేతలను కించపరిచేలా మాట్లాడటం సరికాదన్నారు.
డీఎస్సీపై ప్రభుత్వానిది ద్వంద్వ వైఖరి
డీఎస్సీపై అసెంబ్లీలో చర్చించి తీర్మానం చేసిన ప్రభుత్వం.. కౌన్సిల్‌లో అదే అంశంపై చర్చ అవసరం లేదనడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని ఆల్ఫా కృష్ణ విమర్శించారు. ఆరోపణలు అవాస్తవమైతే స్వతంత్ర దర్యాప్తుకు, సీబీఐ విచారణకు ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతోందని ప్రశ్నించారు. ప్రజా జీవితంలో ఉన్న నేతలు నైతికత, జవాబుదారీతనంతో వ్యవహరించాలని సూచించారు. ఇప్పటి వరకు అధికార పార్టీ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలకు రాజకీయంగా గట్టిగా సమాధానం ఇస్తామని హెచ్చరించారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి ఆల్ఫా కృష్ణ


