సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి సుమారు నాలుగు నెలలపాటు విశేష సేవలందించిన ఒడిశాకు చెందిన లక్ష్మీకాంత్‌నాయక్ దాస్ బుధవారం సింహగిరి నుంచి తిరుగుపయనమయ్యారు. ఒడిశాలోని పట్టుపురానికి చెందిన దాసుల కుటుంబం తరతరాలుగా అప్పన్నస్వామికి సేవలందిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుత తరానికి చెందిన లక్ష్మీకాంత్‌నాయక్ ఈ ఏడాది ఏప్రిల్ 27న సింహగిరికి వచ్చారు. సింహగిరిపై ఉన్న దాస సదనం ఆశ్రమంలో ఉంటూ స్వామికి విశేష సేవలందించారు. నిత్యకల్యాణం, గరుడసేవ, ఊంజల్‌సేవ, కోలా సేవ, లక్ష తులసి పూజ తదితర సేవలను జరిపించారు. తిరుగు ప్రయాణంలో భాగంగా బుధవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో తన పరివారంతో దాస సదనం నుంచి ఆలయానికి చేరుకున్నారు. స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం కొండదిగువ ఉన్న దేవస్థానం ఈవో కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ ఈవో జల్లేపల్లి వెంకటరావు దుశ్శాలువాతో సత్కరించి, నూతన వస్త్రాలు అందించారు. దాసుడు కూడా ఈవోకు నూతన వస్త్రాలు అందించి, సత్కరించారు. అనంతరం అక్కడి నుంచి దాసుడు ఒడిశాకు పయనమయ్యారు.


