బీచ్‌రోడ్డు: విశాఖపట్నంలోని మహాత్మాగాంధీ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ 300 బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్లు పూర్తి చేసుకుంది. ఈ ఘనత సాధించిన ఆంధ్రప్రదేశ్‌లోని తొలి ఆసుపత్రిగా నిలిచిందని ఆసుపత్రి ఎండీ, చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డా. మురళీకృష్ణ తెలిపారు. బుధవారం ఓ హోటల్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. రక్త క్యాన్సర్లు, ఇతర సంక్లిష్ట రక్త సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న పెద్దలు, చిన్నారులకు బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ సేవలు అందించడంలో ఈ మైలురాయి ఆసుపత్రి నైపుణ్యానికి నిదర్శనమన్నారు. 300 ట్రాన్స్‌ప్లాంట్ల వెనుక వైద్య బృందం నైపుణ్యం, సమన్వయం, అంకితభావం ఉన్నాయని చెప్పారు. లుకేమియా, లింఫోమా, మల్టిపుల్ మైలోమా, తలసేమియా, అప్లాస్టిక్ అనీమియా తదితర వ్యాధులకు చికిత్స అందిస్తున్నామని తెలిపారు. చీఫ్ మెడికల్ ఆంకాలజిస్ట్, హెమటో–ఆంకాలజిస్ట్ డా. బాలస్టాలిన్ చౌదరి మాట్లాడుతూ.. 300 ట్రాన్స్‌ప్లాంట్ల అనుభవంతో సంక్లిష్ట రక్త సంబంధిత వ్యాధులకు సమగ్ర చికిత్స అందించే సామర్థ్యం మరింత బలోపేతమైందన్నారు. సీనియర్ క్లినికల్ హెమటాలజిస్ట్, హెమటో–ఆంకాలజిస్ట్ డా. చంద్రశేఖర్ బెండి మాట్లాడుతూ.. ట్రాన్స్‌ప్లాంట్‌కు ముందు పరీక్షల నుంచి అనంతర సంరక్షణ వరకు సమగ్ర సేవలు అందిస్తున్నామని తెలిపారు. సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్, హెమటో–ఆంకాలజిస్ట్ డా. ప్రవీణ వూన్నా, మెడికల్ ఆంకాలజిస్ట్, పీడియాట్రిక్ హెమటో–ఆంకాలజిస్ట్ డా. రజనీ ప్రియ తదితరులు పాల్గొన్నారు.


