కన్నీటి ప్రయాణం! | - | Sakshi
Sakshi News home page

కన్నీటి ప్రయాణం!

Aug 20 2026 12:05 AM | Updated on Aug 20 2026 12:05 AM

సాక్షి, విశాఖపట్నం: దశాబ్దాలుగా అడవుల్లో.. లూప్‌లైన్లలో.. అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో విధులు నిర్వర్తిస్తున్న రాయగడ రైల్వే ఉద్యోగుల సహనం కట్టలు తెంచుకుంది. పూర్వపు వాల్తేరు డివిజన్‌ విభజన, కొత్త రైల్వే జోన్‌ ఏర్పాటు నేపథ్యంలో తమకు జరుగుతున్న అన్యాయంపై ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. అధికారుల ఏకపక్ష నిర్ణయాలకు వ్యతిరేకంగా బుధవారం సిరిపురంలోని రైల్వే జోన్‌ జీఎం ప్రధాన కార్యాలయం ఎదుట శాంతియుత ర్యాలీ, ధర్నా నిర్వహించారు. కుటుంబాలకు దూరంగా ఏళ్ల తరబడి విధులు నిర్వహిస్తున్న తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.

హామీ అమలు ఏదీ..?

వాల్తేరు డివిజన్‌ను విశాఖపట్నం, రాయగడ డివిజన్లుగా పునర్విభజించిన తర్వాత ఉద్యోగుల పోస్టింగులు, బదిలీల విషయంలో పారదర్శకత లోపించిందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. రైల్వే బోర్డు నిబంధనల ప్రకారం కేకే, కేఆర్‌ లైన్లలో పనిచేస్తున్న ఉద్యోగులను రెండేళ్లలో విశాఖకు బదిలీ చేస్తామని గతంలో ఉన్నతాధికారులు హామీ ఇచ్చారని చెబుతున్నారు. అయితే మూడేళ్లు గడిచినా ఆ హామీ అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త రైల్వే జోన్‌ డీపీఆర్‌లో పేర్కొన్న విధంగా ఉద్యోగుల నుంచి ఏ డివిజన్‌లో పనిచేయాలనుకుంటున్నారో ఆప్షన్లు కూడా తీసుకోలేదని వాపోతున్నారు. గతంలో న్యాయబద్ధమైన బదిలీల కోసం అమలు చేసిన ‘ట్రయాంగిల్‌, పెంటగోనల్‌’ పాలసీలను కూడా పక్కనబెట్టారని ఆరోపిస్తున్నారు. డివిజన్ల విభజనకు ముందు పాత సిబ్బంది నుంచి ఆప్షన్లు తీసుకుని, వారి బదిలీలు పూర్తిచేసిన తర్వాతే ఖాళీలను భర్తీ చేయాల్సి ఉన్నా.. ఆ ప్రక్రియను విస్మరించారని చెబుతున్నారు.

సీనియర్లకు అడవులు.. కొత్తవారికి కొలువులు!

13–14 ఏళ్లుగా గ్రూప్‌–డీ స్థాయి నుంచి పదోన్నతులు పొందిన పలువురు సీనియర్‌ ఉద్యోగులు ఇప్పటికీ ఏజెన్సీ, అటవీ ప్రాంతాల్లోనే విధులు నిర్వహిస్తున్నారు. నిబంధనల ప్రకారం వీరిని విశాఖ మెయిన్‌లైన్‌కు తీసుకురావాల్సి ఉన్నా.. ఆ స్థానాల్లో కొత్తగా నియమితులైనవారికి, ఇతర జోన్ల నుంచి వచ్చిన వారికి పోస్టింగులు ఇస్తున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. మెగా బ్లాక్‌లు, పాయింట్ల రెన్యువల్‌ వంటి ప్రమాదకర పనులను సరైన నివాస, ఇతర మౌలిక సదుపాయాలు లేని ప్రాంతాల్లో వయసు పైబడిన సీనియర్లు నిర్వహిస్తుంటే.. కొత్తవారికి కోరిన చోట పోస్టింగులు ఇవ్వడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

‘సాంకేతిక’ సాకులతో సీనియారిటీకి మంగళం

వాల్తేరు డివిజన్‌ విభజన, కొత్త జోన్‌ ఏర్పాటు ప్రక్రియలో కీలకమైన ఉమ్మడి సీనియారిటీ జాబితాలను పరిగణనలోకి తీసుకోకుండా స్థానాల భర్తీ చేపట్టారని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. గూడ్స్‌ ట్రైన్‌ మేనేజర్లు, ట్రాక్‌మెన్‌ తదితర క్షేత్రస్థాయి కేటగిరీల్లో ఏళ్లుగా కేకే, కేఆర్‌ లైన్లలో పనిచేస్తున్న సీనియర్లకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని చెబుతున్నాయి. రోస్టర్‌, సీనియారిటీకి సంబంధించిన అంశాల్లో సాంకేతిక కారణాలను చూపుతూ తమ హక్కులను కాలరాస్తున్నారని మండిపడుతున్నాయి.

కుటుంబాలకు దూరమై.. మానసిక క్షోభ

ఏళ్లుగా కుటుంబాలకు దూరంగా పనిచేస్తుండటంతో ఉద్యోగుల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. పిల్లల చదువులు, వృద్ధ తల్లిదండ్రుల బాగోగులు చూసుకోలేకపోతున్నామని బాధిత కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పండుగలు, కుటుంబ వేడుకలకు కూడా దూరంగా ఉండాల్సి వస్తోందని వాపోతున్నారు. అధికారులు వ్యక్తిగత ప్రాధాన్యాలకు స్వస్తి పలికి డీపీఆర్‌, రైల్వే బదిలీ విధానాల ప్రకారం పారదర్శకంగా పోస్టింగులు, బదిలీలు చేపట్టాలని కోరుతున్నారు. రైల్వే బోర్డు, ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించి తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

డీపీఆర్‌ నిబంధనలు బేఖాతరు.. బదిలీ హామీ బుట్టదాఖలు

మూడేళ్లయినా రాని బదిలీలు.. సీనియర్లకు ఏజెన్సీలే

కొత్తవారికి కోరిన చోట పోస్టింగులు.. సీనియర్లకు అన్యాయం

ట్రయాంగిల్‌, పెంటగోనల్‌ పాలసీలకు పాతర

పారదర్శక బదిలీల కోసం బాధిత కుటుంబాల డిమాండ్‌

కుటుంబ భారం మోయలేకపోతున్నాం

నా భర్త అప్పలరాము కోరాపుట్‌లో పనిచేస్తున్నారు. ఆరు నెలల క్రితం పదోన్నతి ఇచ్చి అక్కడికి పంపించారు. పిల్లలు, వృద్ధ తల్లిదండ్రులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. భర్తకు సెలవు వచ్చినా రాకపోకలకే సమయం సరిపోతోంది. పిల్లల చదువు, తల్లిదండ్రుల వైద్య బాధ్యతలన్నీ నాపైనే పడుతున్నాయి. ఆరోగ్యపరంగానూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. అధికారులు వెంటనే స్పందించి న్యాయం చేయాలి.

– శానాపతి కళావతి, లోకోపైలట్‌ షంటర్‌ భార్య

పదోన్నతి వచ్చినా.. నిరాశే

మా నాన్న తొమ్మిదేళ్లుగా జైపూర్‌ డివిజన్‌లో పనిచేస్తున్నారు. పాములు, ఎలుగుబంట్లు సంచరించే ప్రాంతంలో కనీస భద్రత కూడా లేని పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్నారు. అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ అక్కడే కొనసాగుతున్నారు. ఇటీవల రెండుసార్లు పదోన్నతి వచ్చినా విశాఖకు బదిలీ చేయలేదు. ఆయన తర్వాత వచ్చిన వారికి మాత్రం పదోన్నతులు ఇచ్చి విశాఖకు తీసుకొచ్చారు. విభజన తర్వాత కూడా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో మా కుటుంబం తీవ్ర మనోవేదనకు గురవుతోంది.

– కావ్య, రైల్వే ఉద్యోగి కుమార్తె

మూడేళ్లయినా కరుణించడం లేదు

నా భర్త పదేళ్లపాటు వాల్తేరు డివిజన్‌లో పనిచేశారు. రెండేళ్ల క్రితం పదోన్నతి ఇచ్చి జగదల్‌పూర్‌, బచేలి, కోరాపుట్‌ ప్రాంతాలకు పంపించారు. డివిజన్ల విభజన సాకుతో అక్కడే కొనసాగించడం అన్యాయం. సికింద్రాబాద్‌ బోర్డులో పరీక్ష రాసి వాల్తేరు డివిజన్‌కు వచ్చిన ఆయనను ఇప్పుడు మరో డివిజన్‌లో కొనసాగించడం ఎంతవరకు సమంజసం? సెలవు దొరికినా ఒక్కరోజులో ఇంటికి చేరలేని పరిస్థితి. ఆరు నెలలు లేదా మూడేళ్లలో తిరిగి తీసుకొస్తామని చెప్పిన అధికారులు.. మూడేళ్లు పూర్తయినా పట్టించుకోవడం లేదు. – కె.పావని, లోకో పైలట్‌ భార్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement